రైతులకు మద్దతు : గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు

4 Feb, 2021 16:17 IST|Sakshi

 వివాదం రేపిన టూల్‌కిట్‌ ట్వీట్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు పలికిన ప్రముఖ స్వీడిష్‌ యువ పర్యావరణ ప్రచారకురాలు గ్రెటా థన్‌బర్గ్‌ (18)పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 120-బీ, 153-ఏ సెక్షన్ల కింద ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనంటూ ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతున్నామంటూ  ట్వీట్లు చేసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది.

భారతదేశంలో రైతు ఉద్యమంపై స్పందించిన గ్రెటా భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నామంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా  ఒక క‌థ‌నాన్ని కూడా షేర్‌ చేశారు. ఆ తర్వాత గూగుల్ డాక్యుమెంట్ ఫైల్‌ను షేర్ చేస్తూ చేసిన మరో ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. ఈ ‘టూల్‌కిట్’ సహాయం చేయాలనుకునే వారి కోసం అని రాశారు. దీంతో భారత ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే కార్యాచరణ ప్రణాళికను వివరించే లింక్‌ ఈ ఫైల్‌లో ఉందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. గ్రెటా తర్వాత పాత పోస్ట్‌ను తొలగించి, అప్‌డేట్ చేసిన ట్వీట్‌ షేర్‌ చేసింది.కానీ, అప్పటికే  చాలామంది ఆ నోట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం. 

శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులకే తన మద్దతు అంటూ ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన కొద్ది నిమిషాల తరువాత గ్రెటా మరోసారి నొక్కి వక్కాణించారు. ద్వేషం, బెదిరింపులు, మానహక్కుల ఉల్లంఘనలు ఇవేవీ తనను  మార్చలేవంటూ ట్వీట్‌ చేశారు

మరోవైపు గ్రెటా, రిహన్నాకు సపోర్ట్‌గా నిలిచిన బాలీవుడ్‌ నటులు, క్రికెటర్లపై  సినీ‌ నటి కంగన రనౌత్ విరుచుకుపడుతోంది. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న వారు రైతులు కాదు, వారు ఉగ్రవాదులంటూ  నోరు పారేసుకుంది.  అలాగే ఇండియాను అస్థిరపరిచేందుకు జరుగుతున్న అంతర్జాతీయ రహస్య పత్రాన్ని షేర్‌ చేసి గ్రెటా అతిపెద్ద తప్పు చేసింది..పప్పూ టీంలో అందరూ జోకర్లే...అంటూ  విమర్శించింది. అటు  రైతులకు మద్దతుగా ట్వీట్‌ చేసిన తాప్సీపై కూడా ‘బీ’గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ అంటూ  అనుచిత వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని వార్తలు