‘తాండవ్‌’ రూపకర్తలపై క్రిమినల్‌ కేసు

19 Jan, 2021 05:30 IST|Sakshi

హిందూ దేవుళ్లను కించపర్చే సన్నివేశాలు ఉన్నాయని ఫిర్యాదులు

ముంబై: వెబ్‌సిరీస్‌ ‘తాండవ్‌’ రూపకర్తలు, అమెజాన్‌ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను కించపర్చారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అమెజాన్‌ ఇండియా హెడ్‌ ఆఫ్‌ ఒరిజినల్‌ కంటెంట్‌ అపర్ణ పురోహిత్, వెబ్‌సిరీస్‌ దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్‌ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో సైఫ్‌ అలీ ఖాన్, డింపుల్‌ కపాడియా తదితరులు నటించారు. శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రీమియర్‌ విడుదలైంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపడానికి నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబైకి వెళ్లనుంది. వెబ్‌సిరీస్‌లోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని మాజీ సీఎం మాయావతి సూచించారు.

బేషరతుగా క్షమాపణ చెబుతున్నాం..
మత విశ్వాసాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కాదని ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌ రూపకర్తలు స్పష్టం చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. తాండవ్‌ను కల్పిత కథ ఆధారంగా చిత్రీకరించినట్లు తెలిపారు. వ్యక్తులు, సంఘటనలకు దీంతో సంబంధం లేదని అన్నారు. ఒకవేళ సంబంధం ఉన్నట్లు అనిపిస్తే అది యాదృచ్ఛికమేనని ఉద్ఘాటించారు.  
 

మరిన్ని వార్తలు