ఐడీఏ బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం

12 Dec, 2020 17:23 IST|Sakshi
ప్రమాదం దృశ్యాలు

సాక్షి, హైదరాబాద్‌ : ఐడీఏ బొల్లారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వింధ్యా ఆర్గానిక్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు కారణంగా కంపెనీలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు. మొత్తం 8మంది గాయపడగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీ మొత్తం రసాయనాలతో నిండిపోయింది.

అధికారులు.. పోలీసులు, ఫైర్ సేఫ్టీ రిస్క్ టీమ్ సిబ్బందితో వింధ్యా కెమికల్స్ వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలం వద్దనుంచి మూడు కిలోమీటర్ల వరకు రాక పోకలను నిలిపివేశారు. విద్యుత్‌ సరఫరాను కూడా ఆపేశారు. 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, వింధ్యా కెమికల్స్‌లో లాక్‌డౌన్‌ తర్వాత మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి. 35 మంది చొప్పున ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి 9 వరకు పనులు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినపుడు ఫ్యాక్టరీలో నలభై మంది ఉన్నట్లు సమాచారం.

ఎనిమిది మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
వింధ్యా ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదంపై పఠాన్‌చెరువు డీఎస్పీ భీంరెడ్డి మాట్లాడుతూ..‘కెమికల్‌ రీయాక్షన్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  శనివారం మధ్యాహ్నం 1గంట సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగినప్పుడు కంపెనీలో 40మంది ఉన్నారు. భోజన విరామం కావడంతో అందరూ బయటకు వచ్చారు. ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల స్టేట్‌మెంట్‌ నమోదు చేస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు