ఘోరం: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు

8 Sep, 2021 15:13 IST|Sakshi

జకర్తాలోని టాంగరింగ్‌ జైలులో ఘటన

41 మంది మృత్యువాత.. 75మందికి పైగా గాయాలు

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

జకర్తా: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. జైలులో అగ్ని ప్రమాదం సంభవించి 41 మంది ఖైదీలు మృతువాత పడ్డారు. 8 మంది తీవ్రంగా గాయపడగా 72 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రపంచం ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో జైలులో మంటలు చెలరేగాయి. అయితే నిద్రలో ఉన్న ఖైదీలు ఈ విషయం తెలియకపోవడంతో అగ్నికీలలకు ఆహుతయ్యారు. 

ఆ దేశ రాజధాని జకర్తాలోని టాంగరింగ్‌ జైలులో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. జైలులోని బ్లాక్‌ సీలో అగ్నిప్రమాదం సంభవించిందని ఆ దేశ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపుపలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలు అదుపులోకి వచ్చాక పరిశీలించగా ఖైదీలు అగ్నికీలల్లో చిక్కుకుపోయి కన్నుమూసినట్లు గుర్తించారు.


అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రతినిధి రికా అప్రియంతి వెల్లడించారు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వాస్తవంగా అయితే బ్లాక్‌లో 40 మంది ఖైదీలు ఉండాల్సి ఉండగా రెట్టింపు స్థాయిలో122 మందికి పైగా ఉంటున్నారని జైళ్ల శాఖ వెబ్‌సైట్‌ తెలుపుతోంది. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడం.. ప్రమాదం సంభివించిన తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీలో రికార్డయ్యింది.

మరిన్ని వార్తలు