టెక్స్‌టైల్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

25 Sep, 2021 07:50 IST|Sakshi
మంటల్ని అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది

వందలాది కాటన్‌ బేళ్లు అగ్నికి ఆహుతి

రూ.కోట్లలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా

యడ్లపాడు (చిలకలూరిపేట): గుంటూరు జిల్లా యడ్లపాడు ఎన్‌ఎస్‌ఎల్‌ టెక్స్‌టైల్స్‌ నూలు మిల్లులో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 16వ నంబర్‌ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ మిల్లులో నాలుగు వైపులా నాలుగు పెద్ద స్టాక్‌ గోడౌన్లు ఉన్నాయి. అయితే, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వైపున ఉన్న కాటన్‌ స్టాక్‌ గోడౌన్‌లో శుక్రవారం సా.5.30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటివరకు అక్కడి కార్మికులు ఐదు లారీల్లో వచ్చిన ప్రెస్సింగ్‌ బేళ్ల (క్యాండిల్స్‌)ను గోడౌన్‌లో అన్‌లోడ్‌ చేశారు. అనంతరం గంట వ్యవధిలోనే అక్కడ ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

మిల్లు సిబ్బంది, కార్మికులు, ఫైర్‌ అధికారులు ఎందరున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. దీంతో వందలాది కాటన్‌ బేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న మిల్లు జీఎం నర్సింహరావు వెంటనే పోలీస్, ఫైర్‌స్టేషన్లతో పాటు మండలంలోని పలు నూలు మిల్లులకు సమాచారం అందించారు. దీంతో చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు ప్రాంతాలకు చెందిన మూడు ఫైర్‌ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. వీటికి యడ్లపాడు, నాదెండ్ల మండలంలోని నూలు, కాటన్‌ మిల్లుల వాటర్‌ ట్యాంకర్లు సహకారం అందిస్తున్నాయి.

కరెంట్‌ సౌకర్యం లేకపోయినా..
ప్రస్తుతం ప్రమాదం జరిగిన కాటన్‌ స్టాక్‌ గోడౌన్‌లో ఎలాంటి విద్యుత్‌ సౌకర్యం లేకపోయినా అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం అంతుపట్టకుండా ఉంది.  అన్‌లోడింగ్‌ సమయంలో కార్మికులెవరైనా సిగరేట్‌ వంటివి పొరపాటున పడేస్తే ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఉండే ఈ గోడౌన్‌లో ఇతర మిల్లులో ప్రెస్సింగ్‌ చేసిన బేళ్లతోపాటు ఎన్‌ఎస్‌ఎల్‌ మిల్లులోని జిన్నింగ్‌ చేసిన బేళ్లు, మరికొంత వేస్ట్‌ బేళ్లు ఉన్నట్లు సమాచారం.

అయితే, ప్రస్తుతం ఎంత స్టాక్‌ ఉందన్న విషయాన్ని చెప్పలేమని జీఎం తెలిపారు. ఇక మొత్తం బేళ్లతో పాటు గోడౌన్‌ కూడా పూర్తిగా ధ్వంసమైందని, రూ.కోట్లలోనే ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫైర్, పోలీసుల విచారణలో ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు