చేపల కూర లొల్లి: మంచం కోడుతో హత్య

24 Jan, 2021 10:49 IST|Sakshi

చేపల కూర విషయమై గొడవ

మంచం కోడుతో కొట్టి చంపిన వైనం

తహసీల్దార్‌ సమక్షంలో మృతదేహం వెలికితీత

ఏడుగురిపై కేసు నమోదు

సాక్షి, సారవకోట (శ్రీకాకుళం): అవలింగి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. అతను హత్యకు గురైనట్టు వెల్లడించారు. ఏడుగురిపై కేసు నమోదైంది. పాతపట్నం సీఐ రవిప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన గంటా పాండురంగారావు సారవకోట మండలంలోని బుడితి సమీపంలో జరుగుతున్న రక్షిత మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణ పనుల కోసం మూడు నెలల క్రితం వచ్చి అవలింగిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నాడు. ఇటీవల సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్లిన ఆయన తనకు పరిచయం ఉన్న తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన పాలమూరి ప్రసాద్‌ (60)ని తనతో పాటు ఈ నెల 21వ తేదీన అవలంగి గ్రామానికి తీసుకొనివచ్చాడు. వీరిద్దరూ స్థానికంగా ఉంటున్న మరో ఇద్దరుతో కలిసి ఆదేరోజు రాత్రి చేపల కూర చేసుకుని మద్యం తెచ్చుకుని పూటుగా తాగారు.

అయితే చేపల కూర విషయంలో పాండురంగారావు, ప్రసాద్‌ మధ్య గొడవ తలెత్తింది. దీంతో సహనం కోల్పోయిన పాండురంగారావు మంచం కోడుతో ప్రసాద్‌ తల, చేతులపై కొట్టడంతో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని స్థానికుల సహాయంలో చెత్త సేకరణ బండిలో తీసుకొనివెళ్లి సమీపంలో ఉన్న చెరువు గట్టుపై పాతి పెట్టారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘోరం వెలుగు చూసింది. వీఆర్వో అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తహసీల్దార్‌ రాజమోహన్‌ సమక్షంలో శనివారం ప్రసాద్‌ మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం కోసం పాతపట్నం తరలించారు. ఈ ఘటనలో పాండురంగారావు, కాకినాడకు చెందిన ట్యాంకు నిర్మాణ కాంట్రాక్టర్, మృతదేహాన్ని తరలించి పాతిపెట్టేందుకు సహకరించిన అవలింగి గ్రామానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. హిరమండలం ఎస్సై మధుసూదనరావు ఉన్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు