విల్లుపురంలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు..

15 Dec, 2020 09:17 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న కుటుంబం (ఫైల్‌)

మృతుల్లో ముగ్గురు పిల్లలు 

సాక్షి, చెన్నై: అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వలవనూరుకు చెందిన మోహన్‌ (32) వృత్తిరీత్యా చెన్నైలో టైలర్‌. భార్య విమలేశ్వరి (28), కుమార్తెలు విజయశ్రీ (8), రాజశ్రీ (7), కుమారుడు శివబాలన్‌ (5) ఉన్నారు. టైలరింగ్‌తో వచ్చే ఆదాయం చాలకపోవడంతో అప్పు చేసి సొంతూరులో వడ్రంగి మిల్లును ప్రారంభించాడు. సొంతిల్లు కూడా నిర్మించుకున్నాడు. కరోనా కారణంగా మిల్లు మూతపడడంతో వడ్డీలు పెరిగిపోయాయి. ఆదాయం కోసం ఆన్‌లైన్‌ జూదం ఆడి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు.

అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో మానసిక ఒత్తికి గురయ్యాడు. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి గదిలో పడుకుని ఉన్న ముగ్గురు పిల్లలను తాడుతో ఉరివేసి హతమార్చాడు. ఆ తర్వాత భార్యభర్తలిద్దరూ ప్రాణాలు తీసుకున్నారు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబం ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..)

మరిన్ని వార్తలు