మొక్కు కోసం వెళ్తూ అనంతలోకాలకు.. 

29 Mar, 2022 02:43 IST|Sakshi
రోడ్డు ప్రమాద దృశ్యం 

ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు మరొకరు మృత్యువాత 

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి శివారులో దుర్ఘటన  

సాక్షి, కామారెడ్డి/మాచారెడ్డి/నిజామాబాద్‌ అర్బన్‌: మొక్కు తీర్చుకునేందుకని బయలుదేరినవారు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు మరోవ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా వస్తూ ప్రమాదవశాత్తు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.

నిజామాబాద్‌ నగరంలోని ఆర్యనగర్‌కు చెందిన వేల్పుల రాధాకృష్ణాచారి(45), తన భార్య కల్పన (42), కుమారులు రాఘవ(15), శ్రీరామ్‌(10)తోపాటు తల్లి సువర్ణ(65)తో కలసి సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి సీతారాములవారి మొక్కు తీర్చుకోవాలని భావించారు. నిజామాబాద్‌ నగరంలోని ఆనంద్‌నగర్‌వాసి జిల్లా నరేందర్‌(45)కు చెందిన కారులో సోమవారం ఉదయం రాధాకృష్ణాచారి కుటుంబమంతా బయల్దేరింది.

ఘన్‌పూర్‌(ఎం) శివారులో ఎదురుగా వస్తున్న కరీంనగర్‌ ఆర్టీసీ డిపో బస్సు వీరి కారును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్‌ సీటులో ఉన్న నరేందర్, ముందు కూర్చున్న రాధాకృష్ణాచారి, వెనుక కూర్చున్న సువర్ణ, కల్పన అక్కడికక్కడే మృతిచెందారు. కారు డోర్‌ తెరుచుకుని బయటకు ఎగిరి పడిన శ్రీరామ్‌ తలపగిలి చనిపోయాడు. రాఘవకు నడుము భాగం విరగడంతోపాటు దవడ పగిలింది. అతడ్ని స్థానికులు కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. 

మూడు గంటలకు పైగా శ్రమించి.. 
కారులో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. సువర్ణ, కల్పన మృతదేహాలను స్థానికులు, పోలీసులు సులువుగా బయటకు తీయగలిగినా రాధాకృష్ణ, నరేందర్‌ మృతదేహాల కోసం 3 గంటలు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సులో 56 మంది ప్రయాణికులున్నారు. అందులో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి.  

ఆదివారమే వెళ్లి ఉంటే.. 
రాధాకృష్ణ నిజామాబాద్‌లోని ఐకేపీలో కమ్యూనిటీ సర్వేయర్‌గా పనిచేస్తూ డిప్యుటేషన్‌పై ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. పెద్ద కుమారుడు రాఘవ తలలో రక్తం గడ్డ కట్టడంతో ఆరునెలల క్రితం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. రాఘవ త్వరగా కోలుకోవాలని తమ ఇలవేల్పు మామిడిపల్లి రాములవారికి ఆ కుటుంబమంతా మొక్కుకుంది. పలు చికిత్సలు చేయగా ఇటీవల రాఘవ కోలుకున్నాడు.

ఈ నేపథ్యంలో మొక్కు తీర్చుకునేందుకు ఆదివారమే ఆలయానికి వెళ్లాలనుకున్నారు. అయితే, రాధాకృష్ణకు ఏదో పనిపడి సోమవారానికి వాయిదా వేసుకున్నారు. బయలుదేరే ముందు సిరిసిల్ల సమీపంలోని కొదురుపాకలో ఉంటున్న తన సోదరుడికి ఫోన్‌ చేసి మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్నామని, తిరుగు ప్రయాణంలో కలుస్తామని రాధాకృష్ణ చెప్పాడు. ఇప్పుడు రాధాకృష్ణ కుటుంబంలో రాఘవ ఒక్కడే మిగిలాడు. నరేందర్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.  

ఉద్యోగం క్రమబద్ధీకరించే లోపే.. 
ఐకేపీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రభు త్వం ఇటీవలే ప్రకటించింది. ఈ మేరకు అధికారులు అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపారు. రాధాకృష్ణ పేరు కూడా ఆ జాబితాలో ఉంది. తన ఉద్యోగం క్రమబద్ధీకరించేలోపే అతడు మృతి చెందారని సహచరులు కన్నీటిపర్యంతమయ్యారు. తన పనితాను చేసుకునేవాడని, ఎవరితోనూ వివాదాలు పెట్టుకునేవాడు కాదన్నారు. 

మరిన్ని వార్తలు