నదిలో దిగి ఐదుగురు గల్లంతు

18 Jan, 2022 03:14 IST|Sakshi
విజేందర్‌సాయి(ఫైల్‌), గారె రాకేశ్‌(ఫైల్‌), అంబాల వంశీ(ఫైల్‌), చంద్రశేఖర్‌ (ఫైల్‌), శ్రీగోపి (ఫైల్‌)

‘ప్రాణహిత’లో ముగ్గురు విద్యార్థులు... కృష్ణా నదిలో మరో ఇద్దరు 

మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో ఘటనలు.. కొనసాగుతున్న గాలింపు

కోటపల్లి(చెన్నూర్‌)/ హుజూర్‌నగర్‌(చింతలపాలెం): మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ఘటనల్లో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ఆరుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతుకాగా, సూర్యాపేట జిల్లా చింతలపాలెం కృష్ణా నదిలో వలలో తీసేందుకు వెళ్లిన ఘటనలో మరో ఇద్దరు గల్లంతయ్యారు.

మంచిర్యాల జిల్లా ఆలుగామ గ్రామానికి చెందిన గారె రాకేశ్‌ (20), అం బాల వంశీ (20), అంబాల విజయేందర్‌ సాయి (16), తగరం శ్రావణ్‌ (21), గారె కార్తీక్, అంబాల రఘు సోమవారం గ్రామ సమీపంలోని ప్రాణహితలో ఈత కొట్టడానికి వెళ్లారు. నది లోతును అంచనా వేయకపోవడంతో ముందుకు వెళ్లి న విద్యార్థులు నీటి ప్రవాహానికి గల్లంతయ్యారు. గారె కార్తీక్, అంబాల రఘు ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా.. కేకలు పెడుతున్న తగరం శ్రావణ్‌ను అక్కడే చేపలు పడుతున్న మత్స్య కారుడు అశోక్‌ ప్రాణాలతో ఒడ్డుకు తీసుకొచ్చాడు.

ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో రాకేశ్, వంశీ, సాయి గల్లంతయ్యా రు. చెన్నూర్‌ రూరల్‌ సీఐ నాగ రాజు ఆధ్వర్యంలో సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చీకటి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. విద్యార్థుల గల్లంతుపై చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో మాట్లాడి గాలిం పు చర్యలను ముమ్మ రం చేయాలని ఆదేశించారు. 

చేపల కోసం వల విసిరి.. 
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన కొమ్ము శ్రీను కృష్ణానదిలో చేపల కోసం వల వేశాడు. వలలను తెచ్చేందుకు అతని కుమారుడు  శ్రీగోపి (13), బావమరిది కందుకూరి చంద్రశేఖర్‌ (24) పులిచింతల బ్యాక్‌ వాటర్‌కి వెళ్లారు.

కొద్దిసేపటి తర్వాత వారికి కొమ్ము శ్రీను ఫోన్‌ చేయగా.. రెండు వలలు తీసామని, మూడో వల తెచ్చేందుకు వెళ్తున్నామని చెప్పారు. అయితే ఎంతసేపటికీ వారు తిరిగిరాకపోవడంతో నదిలో గల్లంతయ్యారని భావించి ఇంజన్‌ పడవలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. సాయంత్రం  వరకు కూడా వారి ఆచూకీ లభించలేదు.

మరిన్ని వార్తలు