మృత్యుశకటం!

27 Dec, 2020 00:55 IST|Sakshi
శనివారం వికారాబాద్‌ జిల్లా ఇజ్రా చిట్టెంపల్లిలో రోడ్డు ప్రమాద దృశ్యం

రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఆటోను ఢీకొట్టిన లారీ 

ఐదుగురు గిరిజనుల దుర్మరణం 

కూలి పనులకు వెళ్తుండగా ప్రమాదం 

వికారాబాద్‌ జిల్లా ఇజ్రా చిట్టెంపల్లిలో ఘటన 

ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఆటోపైకి దూసుకెళ్లిన లారీ 

లారీ డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం 

మృతుల్లో ముగ్గురు విద్యార్థులు 

సాక్షి, వికారాబాద్‌: వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు. రోజు మాదిరిగానే పనులకు వెళ్లడానికి ఉదయాన్నే సద్ది కట్టుకుని ఆటో ఎక్కారు. మరికొందరు రావాల్సి ఉండటంతో వారి కోసం చూస్తూ ఆటోలో కూర్చుని ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పొగమంచు కమ్మేసి ఉండటంతో ఎదురుగా వస్తున్న మృత్యుశకటాన్ని గమనించలేకపోయారు. అంతే.. రెప్ప మూసి తెరిచేలోపే ఘోరం జరిగిపోయింది. ఓ లారీ వేగంగా వచ్చి ఆటోను నుజ్జునుజ్జు చేసింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రా చిట్టెంపల్లిలో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చదవండి: (ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ) 

కూలిపనులకు బయలుదేరి.. 
ఇజ్రా చిట్టెంపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ హర్యా (హరి) సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం శివన్నగూడెం గ్రామంలో రెండెకరాలు కౌలుకి తీసుకుని పత్తి సాగు చేశాడు. ఈ నేపథ్యంలో పత్తి తీసేందుకు ఇజ్రా చిట్టెంపల్లి నుంచి శనివారం పది మంది కూలీలను తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రే వారికి సమాచారం ఇచ్చాడు. శనివారం ఉదయం 7 గంటలకు చిట్టెంపల్లి బస్టాండు సమీపంలో ఆటో(టీఎస్‌ 07యూఏ–1929) ఉంచాడు. కూలీలు ఒక్కొక్కరుగా వచ్చి ఆటో ఎక్కుతున్నారు. కుటుంబ పోషణ కోసం జాటోత్‌ శేనిబాయి(55), జాటోత్‌ రేణుకాబాయి(27).. ప్రస్తుతం చదువులు లేకపోవడంతో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉందామనే ఉద్దేశంతో రమావత్‌ సంధ్య(18), జాటోత్‌ సోనిబాయి(16), జాటోత్‌ నితిన్‌(16) కూలీపనులకు వెళుతున్నారు. ఈ ఐదుగురు ఆటో ఎక్కి కబుర్లు చెప్పుకుంటున్నారు.

మరో ఐదుగురు ఇంకా రాకపోవడంతో వారిని తీసుకురావడం కోసం హరి గ్రామంలోకి వెళ్లాడు. ఈ సమయంలో మోమిన్‌పేట నుంచి ఎర్రమట్టి లోడ్‌తో తాండూరు వైపు వెళ్తున్న ఓ లారీ(ఏపీ 28వై–9596) వేగంగా వచ్చింది. తొలుత అక్కడ ఉన్న బారికేడ్లను ఢీకొట్టి, ఎదురుగా వస్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సు(టీఎస్‌ 34, టీఏ–6125) వెనకభాగాన్ని.. ఆ తర్వాత రోడ్డుపై నిలిచి ఉన్న ఆటోను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఆటోను కొంత దూరం లాక్కెళ్లి ఓ కిరాణా షాపులోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో సంధ్య తల, మొండెం వేరై ప్రాణాలు కోల్పోగా.. నితిన్, శేనిబాయి, సోనిబాయి నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన రేణుకాబాయిని శేరిలింగంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం కన్నుమూసింది. 

అతివేగమే కారణం.. 
ఇజ్రా చిట్టెంపల్లి రహదారి కొంచెం దిగుడుగా ఉంటుంది. అక్కడ వాహనాలను నెమ్మదిగా నడపకుంటే అదుపు తప్పే అవకాశం ఉంది. దీంతో అక్కడ వాహనాల వేగం అదుపు చేసేందుకు పోలీసులు గ్రామ ప్రధాన రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, లారీ డ్రైవర్‌ రఫీక్‌ ఇవేమీ పట్టించుకోకుండా అతివేగంగా వాహనం నడిపాడు. అదే సమయంలో భారీగా పొగమంచు ఉండటంతో బారికేడ్లు కనపడలేదు. దీంతో లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. మరోవైపు బస్సు డ్రైవర్‌ విక్రమ్‌ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఎదు రుగా లారీ వేగంగా వస్తున్న విషయం గమనించి.. బస్సును ఎడమవైపు తిప్పాడు. దీంతో లారీ బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టి, ఆ తర్వాత ఆటోపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నా రు. వీరికి ప్రాణాపాయం తప్పింది. లారీ డ్రైవర్‌ అతివేగంగా నడపకపోయినా.. ఆటో డ్రైవర్‌ తన ఆటోను రోడ్డుపక్కన నిలిపి ఉంచకుండా గ్రామంలోకి తీసుకెళ్లినా ప్రమాదం జరిగి ఉండేది కాదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ఆటో డ్రైవర్‌ హరి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. 

మిన్నంటిన హాహాకారాలు..
ఆటోను లారీ ఢీకొట్టిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అక్కడ హృదయవిదారకమైన దృశ్యాలను చూసి నిర్ఘాంతపోయారు. తల, మొండెం వేరుగాపడి ఉన్న సంధ్యను చూసి ఆమె తల్లిదండ్రులు కమల్, శవంత ఇద్దరూ మూర్ఛపోయారు. నితిన్, సోనిబాయి, శేనిబాయి మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. విగతజీవులైన తమవారిని చూసి కుటుంబ సభ్యుల గుండెలవిసేలా రోదించారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ రఫీక్‌ను గ్రామస్తులు చితకబాదారు. ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు రఫీక్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌ తరలించారు. 

పెద్ద ప్రమాదం తప్పింది 
ఇజ్రా చిట్టెంపల్లి బస్టాప్‌ వద్ద ఇద్దరు ప్యాసింజర్లను ఎక్కించుకుని బస్సును ముందుకు తీసుకెళ్తున్నా. అంతలోనే ఎదురుగా అతివేగంతో వస్తున్న లారీ మొదట బారికేడ్‌ను ఢీకొట్టింది. లారీ బస్సును ఢీకొట్టే ప్రమాదాన్ని గమనించి వెంటనే బస్సును ఎడమవైపు తిప్పాను. లారీ వేగంగా బస్సు వెనక భాగాన్ని ఢీకొని వెళ్లి రోడ్డుపై నిలిచి ఉన్న ఆటోను ఢీకొట్టింది. నేను బస్సును ఎడమవైపు తిప్పకపోతే లారీ బస్సును నేరుగా ఢీకొనేది. నేను అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న 15 మందికి ప్రమాదం తప్పినట్లయింది.      – విక్రమ్, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ 

బారికేడ్లు కనిపించలేదు 
మోమిన్‌పేటలో మట్టి నింపుకొని తాండూరు వైపు వెళ్తున్నా. పొగమంచు ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై పోలీసులు ఉంచిన బారికేడ్‌లు కనిపించలేదు. దీంతో బారికేడ్‌ను లారీ ఢీకొంది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రమాద ఘటనతో షాక్‌లో ఉన్నా.      – రఫీక్, లారీ డ్రైవర్‌    

మరిన్ని వార్తలు