దూసుకొచ్చిన మృత్యువు

23 Feb, 2023 05:22 IST|Sakshi
ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిశ్చితార్థానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తోన్న గిరిజన కుటుంబాలపై మృత్యువు లారీ రూపంలో దూసుకువచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. తీవ్ర గాయాలతో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు.

గాయపడిన మరో ఐదుగురు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంటివలసకి చెందిన 2 కుటుంబాల్లోని 12 మంది గిరిజనులు నిశ్చితార్థం కోసం అదే మండలంలోని తుమ్మలవలసకి వెళ్లారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి సొంత గ్రామానికి ఆటోలో బయల్దేరారు.

20 నిమిషాల్లో ఇళ్లకు చేరతారనగా..చోళ్లపదం శివాలయం మలుపు వద్ద ఆటోను పార్వతీపురం నుంచి కూనేరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జ్జయింది. ప్రయాణిస్తోన్న వారంతా ఎగిరి పడిపోయారు. ప్రమాదంలో ఊయక నరసమ్మ (54), ఊయక లక్ష్మి (48), మెల్లిక శారద(35), మెల్లిక అమ్మడమ్మ(80), ఊయక వెంకట్‌(55) అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయాలైన మిగతా 8 మందిని పోలీసులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్‌ల్లో తీసుకువెళ్లారు. వారిలో ఊయక రామస్వామి, ఊయక వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, అదనపు ఎస్పీ దిలీప్‌కిరణ్‌లు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు