వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

3 Sep, 2020 00:57 IST|Sakshi

కారును ఢీకొన్న ఇసుక లారీ 

అక్కడికక్కడే ఐదుగురు యువకులు మృతి 

దామెర మండలం పసరగొండ వద్ద ఘటన 

వరంగల్‌లో పుట్టినరోజు వేడుకలకు హాజరైన స్నేహితులు 

ములుగు వెళ్తుండగా ప్రమాదం

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఇసుక లారీ అతి వేగం ఐదుగురు యువకులను బలితీసుకుంది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన యువకులను ఇసుక లారీ రూపంలో మృత్యువు కబలించింది. స్నేహితుడి సోదరుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వారు అంతలోనే విగతజీవులుగా మారారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. కాళేశ్వరం నుంచి వరంగల్‌ వైపు వేగంగా వస్తున్న ఇసుక లారీ ఈ యువకులు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాశ్‌(23), పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేశ్‌(23), హసన్‌పర్తికి చెందిన గజవెల్లి రోహిత్‌(20), ములుగుకు చెందిన కొండబోయిన నరేశ్‌(23), వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్‌ సాబీర్‌(19) ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయ టకు తీశారు. అక్కడ లభించిన ఆధారాలతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

కారులో స్నేహితుడిని దింపేందుకు..  
పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాశ్‌ డిగ్రీ చదువుతున్నాడు, నర్సంపేటకు చెందిన షేక్‌ సాబీర్‌ ఆటోనగర్‌లో ఉంటూ బేకరీలో పని చేస్తున్నాడు. హసన్‌పర్తికి చెందిన గజవెల్లి రోహిత్, ములుగుకు చెందిన కొండబోయిన నరేశ్, పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేశ్‌ కూలి పని చేస్తున్నారు.  రాకేశ్‌ సోదరుడు ప్రవీణ్‌ పుట్టిరోజు సందర్భంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి రాకేశ్‌ తన స్నేహితులను ఆహ్వానించాడు. వేడుకల్లో ఆరుగురు కలసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి కావడంతో ములుగుకు  బస్సులు లభించవని, నరేశ్‌ను ఇంటి దగ్గర దింపేందుకు హన్మకొండలోని ఓ స్నేహితుని దగ్గర నుంచి కారును తీసుకొచ్చారు. ఆ ఐదుగురు యువకులు కారులో బయలుదేరారు. తెల్లవారు జామున పసరగొండ క్రాస్‌ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న సమయంలో లారీ వేగంగా వచ్చి కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని ఇన్‌చార్జి డీసీపీ వెంకటలక్ష్మి బుధవారం పరిశీలించారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించారు.   రాకేశ్‌కు వివాహం అయింది. 3 నెలల కూతురు ఉంది. కాగా,రాత్రి అయిందంటే కాళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున ఇసుక లారీలు తరలి వెళుతుంటాయని జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు. 

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన లారీ 

మరిన్ని వార్తలు