అత్యాచారం జరగలేదు

2 Oct, 2020 03:15 IST|Sakshi

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలోనూ ఇదే విషయం స్పష్టమైంది

మెడకు తీవ్రస్థాయి గాయంవల్లే ఆమె మరణించింది: ఉత్తరప్రదేశ్‌ పోలీసులు

ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక పోలీస్‌ బృందం

లక్నో: హాథ్రస్‌ బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని యూపీ పోలీసులు ప్రకటించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలో కూడా అదే విషయం స్పష్టమైందని గురువారం యూపీ ఏడీజీ(శాంతి భద్రతలు) ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. మెడపై అయిన తీవ్రస్థాయి గాయం కారణంగా ఆమె చనిపోయిందన్నారు. ‘ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌ వచ్చింది. అత్యాచారం కానీ, గ్యాంగ్‌ రేప్‌ కానీ జరగలేదని అందులో స్పష్టంగా ఉంది’ అన్నారు.

‘చనిపోకముందు, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ.. నిందితులు తనను కొట్టారనే బాధితురాలు చెప్పింది కానీ, అత్యాచారం చేసినట్లు చెప్పలేదు’ అని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే,  నలుగురు నిందితులు సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనను గ్యాంగ్‌ రేప్‌ చేశారని బాధిత యువతి వాంగ్మూలం ఇచ్చినట్లు గతంలో ఎస్పీ విక్రాంత్‌ వీర్‌ వెల్లడించడం గమనార్హం. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో తన మెడను గట్టిగా నులిమారని, ఆ సమయంలో తన నాలుక తెగిపోయిందని ఆమె వివరించినట్లు ఎస్పీ చెప్పారు.

కలెక్టర్‌ బెదిరింపు  
బాధితురాలి తండ్రిని హాథ్రస్‌ జిల్లా కలెక్టర్‌ బెదిరిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్‌ అయింది. ‘మీడియా వాళ్లలో సగం మంది ఈరోజు వెళ్లి పోయారు. మిగతా సగం రేపు వెళ్లిపోతారు. ఇక్కడ స్థానికంగా మీతో ఉండేది మేమే. నీ స్టేట్‌మెంట్‌ను మారుస్తావా?లేదా? అనేది నువ్వే ఆలోచించుకుని నిర్ణయించుకో’ అంటూ కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ బాధితురాలి తండ్రితో బెదిరింపు స్వరంతో చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రవీణ్‌ కుమార్‌ బదులివ్వలేదు. ఈ ఘటన విషయంలో అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారులు చెప్పినట్లు వినకపోతే, సమస్యలు ఎదుర్కొంటారని జాయింట్‌ కలెక్టర్‌ కూడా బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించినట్లు స్థానికులు వెల్లడించారు.  
ఒత్తిడి చేస్తున్నారు


తన స్టేట్‌మెంట్‌ను మార్చుకోవాలని అధికారులు, పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు బలవంతంగా తీసుకువెళ్లి, తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. తన కూతురి హత్యాచారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.

యూపీలో మరో కిరాతకం
బలరాంపూర్‌: యూపీలోని బలరాంపూర్‌ జిల్లాలో 22 ఏళ్ల మరో దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా, బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. యువతిపై అత్యాచారం ఘటనలో షాహిద్, సాహిల్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

దుండగుల దాడిలో తన కుమార్తె కాళ్లు, వెన్నెముక విరిగిపోయాయని బాధితురాలి తల్లి తెలిపారు. మంగళవారం కాలేజీలో ప్రవేశం కోసం వెళ్లివస్తున్న తన బిడ్డను నలుగురు వ్యక్తులు అపహరించారని, మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి, దురాగతానికి పాల్పడ్డారని, తర్వాత రిక్షాలో తీసుకొచ్చి, తమ ఇంటి ముందు పడేశారని పేర్కొన్నారు. బాధితురాలి కాళ్లు, వెన్నుముక విరిగినట్లు పోస్టుమార్టంలో బయట పడలేదని జిల్లా ఎస్పీ దేవ్‌రంజన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు