కొంగుపట్టి లాగి.. జాకెట్‌ చించి..

16 Jul, 2021 01:19 IST|Sakshi

పోడుభూముల్లో ఆదివాసీ మహిళలపై ఫారెస్టు అధికారుల దాష్టీకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

టేకులపల్లి (భద్రాద్రి కొత్తగూడెం): పోడుభూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీ మహిళారైతులపై అటవీఅధికారులు దౌర్జన్యం చేయడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ సిద్ధారం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సిద్ధారం సమీపంలో ఆదివాసీలు 30 ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్నారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి పట్టాలు ఇచ్చారు. మరికొన్ని భూములకు ఫారెస్టు అధికారులు రీసర్వే చేయడంతో బాధిత రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం సాగు చేసుకుంటున్న రైతులు మధ్యాహ్న భోజనానికి ఇళ్లకు వెళ్లిన సమయంలో అటవీ అధికారులు పోడు భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న మహిళలను దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యానికి దిగారు.

‘ఎవడబ్బ సొమ్మని పోడు దున్నుతున్నారు’ అని తిడుతూ అరకలను తొలగించేందుకు ప్రయత్నించగా మహిళారైతులు అడ్డుకున్నారు. బీట్‌ ఆఫీసర్‌ మోతీలాల్‌ ఆగ్రహంతో మహిళా రైతులు జోగ కుమారి, కోరం రమణల కొంగుపట్టి లాగడంతో వారి జాకెట్లు చిరిగిపోయాయి. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎఫ్‌ఆర్‌వోను ‘సాక్షి’ ఫోన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. కాగా, ఈ ఘటనపై బాధితులు జోగ కుమారి, కోరం రమణతోపాటు మహిళారైతులు స్వరూప, సమ్మక్క, పవిత్ర, లక్ష్మీ, నాగమణి, పద్మ, వివిధ పార్టీల నేతలు బోడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీట్‌ ఆఫీసర్లు మోతీలాల్, రమేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు