ఇప్పపువ్వు కోసం వెళ్తే గిరిజనులపై దాడి

27 Mar, 2021 11:49 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూలు: అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూర్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆదివాసీ గిరిజనులు మన్ననూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇప్పపువ్వు కోసం అడవికి వెళ్లగా ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకొని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో పది మంది గిరిజనులకు గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా అటవీ అధికారులు గిరిజనులను మన్ననూర్ బేస్ క్యాంప్‌లో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని కర్రలతో అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. గిరిజనులు చేసిన దాడిలో పలువురు ఫారెస్ట్ అధికారులకు గాయాలు అయ్యాయి.

తమవారిపై అటవీ అధికారులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినందుకు గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి అటవీశాఖ సిబ్బంది తమను వేధిస్తున్నారని గిరిజనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో దొరికే ఇప్పపువ్వు కోసం తాము వెళితే పోలీసులు అకారణంగా తమను గాయపరిచారని బాధితులు తెలిపారు. గిరిజనులు పెద్ద సంఖ్యలో పోలీసులు చేసిన దాడికి నిరసనగా జాతీయ రహదారిపై ధర్నా చేశారు. దీంతో జాతీయ రహదారిపై పలు వాహనాలు నిలిచిపోయాయి. 

చదవండి: భార్యా భర్తల గొడవ.. బామ్మర్తి చేతిలో బావ హతం

మరిన్ని వార్తలు