అడవులే కేంద్రంగా ఉగ్రవాద శిక్షణ

13 May, 2023 04:08 IST|Sakshi

ఆయుధాలుసమీకరించింది మహ్మద్‌ సలీం 

అక్కడి బృందానికీ ఇతడితోనే శిక్షణ 

ఈ ఐదుగురి నుంచి విదేశాలకు ఫోన్‌ కాల్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నగరంతో పాటు భోపాల్‌లో పట్టుబడిన 16 మంది ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. నగర శివార్లలో ఉన్న వికారాబాద్‌లోని అనంతగిరి అడవుల మాదిరిగానే భోపాల్‌ సరిహద్దుల్లోని రైసెన్‌ అడవిని ఎంచుకున్నట్లు ఏటీఎస్‌ అధికారులు నిర్థారించారు. అక్కడ అరెస్టయిన 11 మందితో పాటు నగరంలో చిక్కిన ఐదుగురినీ ప్రస్తుతం ఏటీఎస్‌ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.

భోపాల్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సయ్యద్‌ డానిష్‌ అలీ ఇంటిలో సూత్రధారి యాసిర్‌ ఖాన్‌ నిర్వహించిన సమావేశాలకు నగరం నుంచి సలీంతో పాటు అబ్దుల్‌ రెహా్మన్, షేక్‌ జునైద్‌ కూడా హాజరయ్యారని ఏటీఎస్‌ చెప్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు సైతం తమకు లభించినట్లు స్పష్టం చేస్తోంది.

గోల్కొండలోని సలీం నివాసంలో ఎయిర్‌ పిస్టల్, పిల్లెట్స్, భోపాల్‌లోని యాసిర్‌ ఇంటి నుంచి నాటు తుపాకీ, తూటాలు సీజ్‌ చేశారు. ఈ నాటు తుపాకీ సేకరించింది, భోపాల్‌ మాడ్యుల్‌కు శిక్షణ ఇచ్చింది కూడా సలీం అని ఏటీఎస్‌ అనుమానిస్తోంది. ఆ కోణంలో అతడిని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. 

విదేశీ నంబర్లకు ఫోన్లపై ఆరా 
నగర మాడ్యుల్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ఫోన్ల నుంచి విదేశీ నెంబర్లకు ఫోన్లు వెళ్లినట్లు అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు వాటి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి విదేశాల్లో ఉన్న వారితో ఉన్న సంబంధాల పైనా దర్యాప్తు చేయనున్నారు. ఉగ్రవాద సాహిత్యాన్ని తన ల్యాప్‌టాప్‌ వినియోగించి సొంతంగా తయారు చేసిన సలీం అందులో అనేక అంశాలు చేర్చాడు.

ఆన్‌లైన్‌లో ఉన్న విషయాలతో పాటు వివిధ పుస్తకాల్లోని అంశాలు క్రోడీకరించి రూపొందించిన ఇందులో జిహాద్, ముజాహిదీన్‌ అంటే ఏమిటి? తాము ఏం చేయాలి? అనే వివరాలతో పాటు ఉగ్రవాద చర్యల్లో పాల్గొంటూ చనిపోయిన వారి కుటుంబాలను ఎలా ఆదుకోవాలి? ఎలాంటి ఆయుధాలు సమీకరించుకోవాలి? క్యాడర్‌ను ఎలా రిక్రూట్‌ చేసుకోవాలి? వివరాలు పొందుపరిచాడు. 

ఈ కేసులో సాక్షులుగా ‘వారు’: సలీం రెహ్మాన్ న్‌ గతంలో మరికొందరిని ఆకర్షించారు. వీళ్లు కేవలం మతపరమైన కార్యక్రమాలు చేపడుతున్నారని భావించిన వాళ్లు కొన్ని సమావేశాలకు హాజరయ్యారు. కొన్నాళ్లకే వీరి వ్యవహరశైలి, కార్యకలాపాలు అనుమానాస్పదంగా భావించిన వారంతా దూరయమ్యారు. వీరిని గుర్తించి, ఈ కేసులో సాక్షులుగా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు