మాజీ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు ప్రదీప్‌ శర్మ అరెస్టు 

18 Jun, 2021 08:01 IST|Sakshi
ప్రదీప్‌ శర్మను అరెస్టు చేసి తీసుకెళ్తున్న ఎన్‌ఐఏ అధికారులు

అంబానీ ఇంటివద్ద కారుబాంబు కేసులో

అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

ముంబై: మాజీ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ప్రదీప్‌ శర్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం అరెస్టు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద కారు బాంబు పెట్టడం, మరో వ్యాపారవేత్త మన్‌సుఖ్‌ హిరానీ హత్య కేసులతో ఆయనకు సంబంధం ఉందని ఎన్‌ఐఏ చెబుతోంది. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసింది. లోనావాలా హిల్స్‌ ప్రాంతంలో అంబీవ్యాలీలో ఆయన్ను అదుపులోకి తీసుకొని, ఎన్‌ఐఏ ఆఫీసులో ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రదీప్‌ శర్మతో పాటు అరెస్టు చేసిన మరో ఇద్దరిని కూడా కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా ఈ నెల 28వ తేదీ వరకు న్యాయస్థానం వారిని ఎన్‌ఐఏ కస్టడీకి ఇచ్చింది.

బుధవారం సాయంత్రం నుంచి ప్రదీప్‌ శర్మను అదుపులోకి తీసుకోవడానికి ఎన్‌ఐఏ ప్రయత్నించింది. ఇందులో భాగంగా ఆయన ఇంటితో సహా పలు చోట్ల సోదాలు జరిపింది. ఈ క్రమంలో ఎన్‌ఐఏకు పలు కీలక పత్రాలు కూడా దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థ సంతోష్‌ షెలార్, ఆనంద్‌ జాదవ్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిని విచారిస్తుండగా ప్రదీప్‌ శర్మ వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాచారం.

సచిన్‌ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్‌ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్‌ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్‌ఐఏ ప్రదీప్‌ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్‌ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్‌కౌంటర్‌ చేశారు.

చదవండి: ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం

చదవండి: మరో 9 నగరాల్లో స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌.. జాబితాలో విశాఖ, మిర్యాలగూడ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు