మాజీమంత్రి అల్లుడి వద్ద రూ.6 కోట్లు మోసం

6 Dec, 2021 08:41 IST|Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన మాజీమంత్రి అల్లుడు, అతడి స్నేహితుల వద్ద చెన్నైకి చెందిన వ్యక్తులు రూ.6 కోట్లు మోసం చేశారు. మాజీమంత్రి అల్లుడు ప్రవీణ్‌ అలెగ్జాండర్, మిత్రులు గౌతమ్, గణేష్‌కుమార్‌కు ఇటీవల చెన్నై పులియాంతోపునకు చెందిన బాలాజీ పరిచయం అయ్యాడు. బాలాజీ మిత్రుడు దినేష్‌ ఎలాంటి రశీదులు లేకుండా దొడ్డిదారిని బంగారంతో పాటు వాహనాలు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు.

దీంతో తొలుత రూ.6 లక్షలకు బంగారం కొనుగోలు చేశారు. ఆ తదుపరి రూ.6.5 కోట్లకు బంగారం కొనేందుకు అలెగ్జాండర్‌తో సహామిత్రులు నిర్ణయించారు. నగదు తీసుకున్న బాలాజీ, అతడి మిత్రుడు దినేష్‌ పత్తాలేకుండా పోయారు. దీంతో ముగ్గురు మిత్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారించిన పోలీసులు బాలాజీ, అతడి తండ్రి తులసీదాసు, మిత్రులు మహేష్, జయకృష్ణన్‌ను ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అజ్ఞాతంలో ఉన్న దినేష్‌కు శాస్త్రి భవన్‌లో కస్టమ్స్‌ వర్గాలు పలువురు సన్నిహితం అని, అందుకే అతడు తక్కువ ధరకు బంగారం, వాహనాలు, ఇతర వస్తువులను విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.  

మరిన్ని వార్తలు