కశ్మీర్‌ భూ స్కామ్‌లో మాజీ మంత్రులు!

24 Nov, 2020 13:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో రోష్ణి చట్టం అడ్డం పెట్టుకొని అక్రమంగా భూములు కలిగిన మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల జాబితాను జమ్మూ కశ్మీర్‌ అధికార యంత్రాంగం బయట పెట్టింది. ఈ జాబితాలో అక్రమంగా భూములు లబ్ధి పొందిన 400 మంది జాబితాలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ మాజీ నాయకులు హసీబ్‌ ద్రాబు, కాంగ్రెస్‌ నాయకులు కేకే ఆమ్లా, జమ్మూ కశ్మీర్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ ఎంవై ఖాన్‌ తదితరులు ఉన్నారు.  జమ్మూ కశ్మీర్‌ పరిధిలోని భూ ఆక్రమణదారులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు 2001లో అప్పటి ఫారూక్‌ అబ్దుల్లా ప్రభుత్వం ‘జమ్మూ కశ్మీర్‌ స్టేట్‌ ల్యాండ్స్‌ వెస్టింగ్‌’ పేరిట ఓ చట్టం తీసుకొచ్చింది. ప్రధానంగా రాష్ట్రంలో విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల కోసం అవసరమైన నిధులను సమీకరించడంలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పుకున్న నాటి ఫారూక్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఆ చట్టాన్ని ‘రోష్ణి’ చట్టంగా పేర్కొంది. ఈ చట్టం దుర్వినియోగం అయిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టానికి ఎలాంటి విలువ లేదంటూ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ 2018లో ఈ చట్టాన్ని కొట్టి వేశారు. (చదవండి: రాహుల్‌ గాంధీ పునరాగమనం!)

2018, జనవరిలో జరిగిన కథువా రేప్‌ కేసులో నిందితుల తరఫున వాదించిన న్యాయవాది అంకుర్‌ శర్మ ఈ చట్టాన్ని ఎత్తివేయాలంటూ వాదించారు. కశ్మీర్‌లో ‘జిహాది’ని అంతమొందించాలంటూ ఈ చట్టాన్ని ఎత్తివేయక తప్పదని చెప్పారు. రోష్ణి చట్టం పేరుతో జరిగిన అక్రమ భూ లావాదేవీలపై దర్యాప్తు జరపాలంటూ సీబీఐని అక్టోబర్‌ 12వ తేదీన జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రోష్ణి చట్టం కింద జరిగిన  దాదాపు 25 వేల కోట్ల కుంభకోణంలో ప్రతి ఎనిమిది వారాలకోసారి దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని కూడా కోరింది. మాజీ రెవెన్యూ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రామన్‌ భల్లా పేరును కూడా ప్రత్యేకించి ప్రస్తావించిన హైకోర్టు, దర్యాప్తులో వెలుగులోకి  వచ్చిన అందరి పేర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించింది. ఆ ఆదేశాలను పురస్కరించుకొనే లబ్ధిదారుల పేర్లను సీబీఐ బయట పెట్టింది. వారిలో పీడీపీ నాయకుడు హసీబ్‌ ద్రాబు ఉన్నారు. ( చదవండి: నితీష్‌ కుమార్‌కు ఆర్జేడీ ఆఫర్‌)

తాము మాత్రం ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, 1956లో తన తాత, హైకోర్టు జడ్జీ నుంచి అర ఎకరం భూమిని కొనుగోలు చేశారని, దానిపై తాను స్టాంప్‌ సుంకాన్ని, ప్రభుత్వ ఫీజులను చెల్లించానని హసీబ్‌ తెలిపారు. తన తాత చనిపోయిన అనంతరం ఆ భూమి 2006–8 మధ్యకాలంలో తన తండ్రికి సంక్రమించిందని, రోష్ణి చట్టం వచ్చినప్పుడు తాను పదవిలో లేనని, ఆ చట్టం కింద లీజులో ఉన్న భూమికి కాస్తా యాజమాన్య హక్కులు వచ్చాయని ఆయన వివరించారు. 

,

మరిన్ని వార్తలు