మాజీ ముత్తవలి హఫీజ్‌పాషా అరెస్ట్‌

4 Mar, 2023 05:37 IST|Sakshi
హఫీజ్‌పాషా (ఫైల్‌)

బాలికపై లైంగికదాడికి యత్నం కేసులో.. 

నిందితుడు ఏఎస్‌పేట దర్గా మాజీ పీఠాధిపతి  

లంగర్‌హౌస్‌/ఆత్మకూరు: మంత్రాలనెపంతో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమేగాక లైంగికదాడికి యత్నించి పారిపోయిన కేసులో ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట దర్గా మాజీ పీఠాధిపతి (ముత్తవలి) హఫీజ్‌ పాషాను హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. లంగర్‌హౌస్‌ ఎండీలైన్స్‌లో నివాసం ఉంటున్న బాలిక మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది.

పలువురు వైద్యులను సంప్రదించినా ప్రయోజనం కనిపించలేదు. బంధువుల సూచనమేరకు ఏపీలోని ఏఎస్‌పేట రెహమతాబాద్‌ షరీఫ్‌ దర్గా పెద్ద షా గులామ్‌ నక్స్‌బాంద్‌ హఫీజ్‌పాషాను సంప్రదించారు. మంత్రాలతో ఆమె వ్యాధి నయం చేస్తానని పలుమార్లు నెల్లూరుకు రప్పించాడు. తాను కూడా తరచు హైదరాబాద్‌ వచ్చి మలక్‌పేటలో ఉంటూ బాధితులను కలిసేవాడు.

మంత్రాలు చదువుతూ వ్యాధి నయం చేస్తున్నట్లు నటిస్తూ నెల్లూరులో పలుమార్లు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. జనవరిలో హైదరాబాద్‌లోని బాధితురాలి ఇంటికి వచ్చిన బాబా ఆమె కుటుంబీకులను బయటికి పంపి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పగా, ఆమెకు పిచ్చి ముదిరిందని బాబా చెప్పడంతో వారు అతడి మాటే నమ్మారు.

ఫిబ్రవరి మొదటి వారంలో మరోసారి బాబా ఆమెను కలవాలని చెప్పడంతో కుటుంబసభ్యులు అతడికి తెలియకుండా ఆ గదిలో సీసీ కెమెరాలను అమర్చారు. గదిలోకి వెళ్లిన బాబా బాలికతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని గుర్తించిన కుటుంబీకులు అతడిని నిలదీయగా ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు.

ఫిబ్రవరి 11న వివాహానికి ఏర్పాట్లు చేయగా అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేరిన అతడు కొందరు పెద్దల సహకారంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గొడవ పెద్దది కావడంతో మతపెద్దలు, వక్ఫ్‌బోర్డు నిర్వాహకులు జోక్యం చేసుకుని నిందితుడిని దర్గా నిర్వహణ బాధ్యతల నుంచి తొలగించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం హఫీజ్‌పాషాను మలక్‌పేటలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు