మాజీ సర్పంచ్‌ దారుణ హత్య 

14 May, 2021 13:17 IST|Sakshi
కృష్ణారావు మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

కనుగులవానిపేటలో దారుణం

పోలీసుల అదుపులో నిందితుడు? 

‘పగ’ వినడానికి రెండక్షరాలే అయినా అది ఎంతటి పరిణామాలకైనా దారితీయిస్తుంది. అది స్నేహితుల మధ్య కావొచ్చు, రక్ష సంబంధీకుల మధ్య కావొచ్చు.. పగ పగే. అదే పగ ఒక్కసారి వచ్చిపోతే రక్త సంబంధాన్ని కూడా చూడదు. చిన్నా పెద్దా తేడా కూడా పట్టించుకోదు. ఆ పగే మాజీ సర్పంచ్‌ను పొట్టనపెట్టుకుంది. మన పైన కరోనా రూపంలో ప్రకృతే పగబట్టింది. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సివస్తోందో తెలియని దారుణ పరిస్థితుల్లో.. మనుషులు ఒకరిపై ఒకరు పగ సాధించుకోవడం అవసరమా..! 

శ్రీకాకుళం రూరల్‌: పాతకక్షల కారణంగా శ్రీకాకుళం రూరల్‌ మండలం కనుగులవానిపేటకు చెందిన మాజీ సర్పంచ్‌ కను గుల కృష్ణారావు (76)ను అదే గ్రామానికి చెందిన కనుగుల సవరరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కు సంబంధించి శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర, టౌన్‌ సీఐ అంబేద్కర్‌  గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. సవరరాజు కనుగులవానిపేట గ్రామంలో ఉన్నప్పుడు సారావ్యాపారం నిర్వహించేవాడు.కనుగుల కృష్ణారావు అప్ప ట్లో సర్పంచ్‌ కావడంతో గ్రామంలో జరుగుతున్న సారా వ్యాపారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలుమా ర్లు సవరరాజు అరెస్టు అయ్యాడు. అప్పటి నుంచి కనుగులవానిపేట గ్రామాన్ని వదిలిన సవరరాజు నరసన్నపేటలోని అత్తవారి గ్రామం నిడగాంకు భార్యాబిడ్డలతో వెళ్లిపోయి 15 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అప్పటి నుంచి కృష్ణారావుపై కక్ష పెంచుకొని అదును కోసం ఎదురు చూస్తున్నాడు. దీనికితోడు కనుగులవానిపేటలోని సవరరాజు అన్నదమ్ముల ఆస్తుల విషయంలో కూడా తమ్ముడికే సపోర్ట్‌గా కృష్ణారావు మాట్లాడటంతో మరింత కక్ష పెంచుకున్నాడు.

హత్య జరిగిందిలా.. 
కనుగులవానిపేటలో ఆస్తులను, పొలాలను చూసుకునేందుకు సవరరాజు గురువారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామానికి వచ్చాడు. ఇప్పిలి, కనుగులవానిపేటకు మధ్య మామిడితోటను ఆనుకుని ఉన్న ఆలయం వద్ద చెట్టు కింద కృష్ణారావు కూర్చున్నాడు. సరవరరాజును చూసి మళ్లీ ఎందుకు వచ్చావురా అంటూ తిట్టాడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న సవర రాజు పదునైన కత్తవ(బల్లెం)తో మెడపై దాడి చేయగా అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు? 
సంఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలోనే హంతకుడు సవరరాజును, మారణాయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రూరల్‌ ఎస్‌ఐ రాజేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: విషాదం: ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య    
ఘోర ప్రమాదం: పోలీసులపై దూసుకెళ్లిన లారీ

మరిన్ని వార్తలు