అతివేగం.. తీసింది ప్రాణం

27 Jun, 2022 07:15 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: భద్రత మరిచి అతి వేగాన్ని నమ్ముకుని జీవితాలను అర్ధాంతరంగా చాలిస్తున్నారు. గమ్యం చేరే ఆతృతలో సమిధలవుతున్నారు. రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో రోడ్లపై నెత్తుటేర్లు పారాయి. నాలుగు పెద్ద ప్రమాదాల్లో మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారు. బెళగావి జిల్లా, చిత్రదుర్గ, తుమకూరు, మండ్య జిల్లాల్లో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 

బెళగావిలో ఏడుగురు కూలీలు.. 
ఆదివారం తెల్లవారుజామున బెళగావి తాలూకా కల్కాళ బ్రిడ్జ్‌ వద్ద ట్రాక్స్‌ క్రూయిజర్‌ వాహనం పల్టీ కొట్టడంతో 7 మంది మృత్యువాత పడ్డారు. రెండు వాహనాల్లో కూలీలు బయల్దేరారు. డ్రైవర్లు పోటాపోటీగా దూసుకెళ్తుండగా ఒక క్రూయిజర్‌ కల్యాళ బ్రిడ్జ్‌ వద్ద పల్టీ కొడుతూ పడిపోయింది. ఏడు మంది అక్కడికక్కడే మరణించారు. మృతులను అడియప్ప చిలబావి (32), బసవరాజ్‌ దళవి (32), బసవరాజ్‌ హనుమన్నవర్‌ (35), ఆకాశ్‌ (40), రామన్న (29), ఫక్కీరప్ప (34), మల్లప్ప (39)గా గుర్తించారు.  మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం బసవరాజు బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు.

 మండ్యలో గ్రామ ఉద్యోగులు...  
వేగంగా వచ్చిన లారీ ఒకటి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నాగమంగళ తాలూకా ఎం. హోసూరు గేట్‌ వద్ద శనివారం రాత్రి జరిగింది. నాగమంగళ తాలూకా బీరేశ్వరపురకి చెందిన దేవరాజు (42), పాండవపుర తాలూకా దేసముద్ర గ్రామానికి చెందిన మంజునాథ్‌ (35), కెన్నాళు గ్రామానికి చెందిన రైతు మంజునాథ్‌ (64) మృతి చెందారు. గ్రామ లెక్కాధికారిగా పనిచేసే దేవరాజు సొంత పని కోసం గ్రామ సహాయకుడు మంజునాథ్, స్వామిని కారులో తీసుకుని వెళ్లాడు. తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారు.  

టెక్కీ ప్రాణాలు తీసిన బైక్‌ రేస్‌  
సరదా బైక్‌ రైడింగ్‌ ఒక టెక్కీ ప్రాణం తీసింది. సూరజ్‌ (27) అనే బైకిస్టు మృత్యువాత పడ్డాడు. తుమకూరు జిల్లా కుణిగల్‌ తాలూకా గవిమఠం వద్ద ఆదివారం ఉదయం జరిగింది. బెంగళూరు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న సూరజ్‌ స్నేహితుడు అజయ్‌తో కలసి వీకెండ్‌ రైడ్‌కు డుకాటీ బైక్‌లలో వెళ్లారు. బెంగళూరు నుంచి అతివేగంగా వెళ్లిన ఇద్దరు గవిమఠం జాతీయ రహదారి–72 వద్ద పరస్పరం పోటీ పడుతూ వాయువేగంతో దూసుకెళ్తున్నారు. సూరజ్‌ అదుపుతప్పి ఒక టెంపో ట్రావెలర్‌ వెనుక భాగాన్ని ఢీ కొట్టి బైక్‌తో సహా పల్టీలు కొడుతూ వంతెన పైనుంచి కిందకి పడిపోయాడు. సూరజ్‌ అక్కడికక్కడే మరణించాడు. కుణిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

చిత్రదుర్గలో మహిళ  
చిత్రదుర్గ జిల్లా చళ్లకెరె పట్టణం బళ్లారి రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీ కొట్టింది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన బైకిస్టు అలీ (55) తీవ్రంగా గాయపడగా, భార్య ఇర్ఫాన (47) మరణించింది. మృతదేహాన్ని, క్షతగాత్రున్ని చెళ్లకెరె ఆస్పత్రికి తరలించారు.     

(చదవండి: షాకింగ్‌ ఘటన... డబ్బాలో ఏడు పిండాలు!)

మరిన్ని వార్తలు