హత్య కేసు నిందితులను పట్టించిన టైలర్‌ లేబుల్‌ 

8 Nov, 2020 11:40 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, పక్కన సీఐ దేవప్రభాకర్, ఎస్‌ఐలు

12 రోజుల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 

పాత ప్రియుడిని అడ్డు తొలగించుకునేందుకు మహిళ కుట్ర

కొత్త ప్రియుడితో కలిసి పక్కాగా హత్యకు పథకం 

కేసు వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి 

యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా): ఓ హత్య కేసులో నలుగురు నిందితులను హతుడు ధరించి ఉన్న చొక్కా టైలర్‌ లేబుల్‌ పట్టించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులను కేవలం 12 రోజుల్లో అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గత నెల 26వ తేదీన పుల్లలచెరువు నుంచి గంగవరం వెళ్లే దారిలో 50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గుర్తుతెలియన వ్యక్తి హత్యకు గురైనట్లు సీఐ దేవప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సమయంలో అతడి చొక్కాపై ఉన్న టైలర్‌ లేబుల్‌ ఆధారంగా మృతుడిది గుంటూరు జిల్లా వినుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన వాడుగా గుర్తించారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

హతుడు వినుకొండ మండలం ఉప్పరపాలేనికి చెందిన తిరుమల శ్రీనుగా గుర్తించారు. శ్రీను గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండ, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, పుల్లలచెరువు ప్రాంతాల్లో తిరుగుతూ నైటీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అతడికి ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. తన స్వగ్రామం ఉప్పరపాలెంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అదే గ్రామానికి చెందిన గోళ్ల నాగార్జునతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని గ్రహించిన శ్రీను ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. శ్రీనును అడ్డు తొలగించుకోవాలని ఆమె మరో ప్రియుడు నాగార్జునతో కలిసి పథకం వేసింది. పథకంలో భాగంగా పుల్లలచెరువులో నైటీలు అమ్ముదామని ఆమె శ్రీనుతో చెప్పింది. గంజాయి తాగే అలవాటు ఉన్న శ్రీను.. ఆమెతో కలిసి గంగవరం రోడ్డులోని నిర్మానుష్య స్థలంలోకి వచ్చాడు.

అక్కడ వేచి ఉన్న ఆమె రెండో ప్రియుడు నాగార్జున కర్రతో దాడి చేసి శ్రీనును తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెతో కలిసి టవల్‌తో అతని గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. గతంలో నిందితుడు నాగార్జున ఒక యువతిని మోసం చేశాడు. హతుడు అప్పట్లో బాధితురాలికి అండగా ఉన్నాడు. ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రియురాలి ప్రోత్సాహం కూడా ఉండటంతో శ్రీనును నాగార్జున హత్య చేశాడు. హత్యానంతరం నిందితుడు హతుడి మెడలోని బంగారు గొలుసు తీసుకెళ్లాడు. తన తండ్రి అంజయ్యకు విషయం చెప్పి అది ఇచ్చాడు. ఆ గొలుసును అమ్మి పెట్టాలని ఆయన తమ సమీప బంధువు రావులపల్లి హనుమంతయ్యకు ఇచ్చాడు. మృతుడి బంగారు గొలుసు, హత్యకు ఉపయోగించిన కర్ర, నిందితుల సెల్‌ఫోన్లు, నాగార్జునకు చెందిన బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నాగార్జున, హతుడి ప్రియురాలు, అంజయ్య, హనుమంతయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. తక్కువ సమయంలోనే హత్య కేసును ఛేదించిన సీఐ దేవప్రభాకర్, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, పి.ముక్కంటి, వి.హరిబాబు, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీను, కానిస్టేబుళ్లు అంజి, హుస్సేన్, రమేష్‌లను డీఎస్పీ అభినందించారు.   

మరిన్ని వార్తలు