వీడిన మిస్టరీ: శ్యామ్‌ది హత్యే! 

28 May, 2021 09:12 IST|Sakshi

 నిర్థారణకు వచ్చిన పోలీసులు

హత్య కేసులో నలుగురు అరెస్టు

అల్లిపురం (విశాఖ దక్షిణ)/విశాఖపట్నం: యువకుడి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడిపోయింది. యువకుడిది హత్యేనని పోలీసులు నిర్థారించారు. మహారాణిపేట పరిధి, తాడివీధికి చెందిన టేకుమూడి శ్యామ్‌ (21) గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 30వ వార్డు కార్పొరేటర్‌ అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన మహారాణిపేట సీఐ జి. సోమశేఖర్‌ యువకుడిది హత్యగా నిర్థారణకు వచ్చారు. యువకుడిని అతని తల్లి సుగుణ, సోదరి లక్ష్మీదుర్గా అలియాస్‌ ఫాతిమాతో పాటు ఆమె భర్త షేక్‌ పీర్‌సాహెబ్, సుగుణ మరో చిన్నల్లుడు ఉప్పరపల్లి అంకిత్‌  సహకారంతో ఈ హత్య చేసినట్లు గుర్తించారు. గురువారం నిందితులు నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సోమశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద కుమార్తె లక్ష్మీదుర్గా అలియాస్‌ ఫాతిమా ఆరోగ్యం బాగాలేదని వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది.

మూడేళ్లుగా కుమారుడు శ్యామ్‌కుమార్‌ బైక్‌ కొనమని వేధించడంతో నాలుగు నెలల క్రితం ఫైనాన్స్‌పై బైక్‌ కొని ఇచ్చింది. వ్యసనాలకు అలవాటు పడ్డ శ్యామ్‌ నెల రోజుల క్రితం బైక్‌ను తాకట్టు పెట్టాడు. ఆ బైక్‌ను విడిపించి ఇమ్మని ప్రతిరోజు గొడవ పెడుతున్నాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన శ్యామ్‌ తల్లి సుగుణను, సోదరి ఫాతిమాను విపరీతంగా వేధించాడు. దీంతో సుగుణ ఆమె ఇద్దరి అల్లుళ్లతో ముందుగానే ప్లాన్‌ చేసుకోవటంతో పెద్దల్లుడు షేక్‌ పీర్‌ సాహెబ్, చిన్నల్లుడు ఉప్పరపల్లి అంకిత్‌ ఇంటికి చేరుకున్నారు. శ్యామ్‌ నిద్రపోయిన తరువాత అల్లుళ్లు ఇద్దరు ఒకరు శ్యామ్‌ కాళ్లపై నిలుచుండగా, ఒకరు చేతులు గట్టిగా పట్టుకున్నారు. కూతురు ఫాతిమా తలగడ ముఖంపై వేసి నొక్కి పట్టుకుంది. సుగుణ ట్రాక్‌ నాడా తాడు తీసుకుని మెడచుట్టూ వేసి బిగించడంతో శ్యామ్‌ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

చదవండి: సాక్షి ఎఫెక్ట్‌: మాయలేడి అరెస్టు 
కారు హారన్‌ మోగించాడని... ఎంత పని చేశారంటే..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు