బాలికపై అఘాయిత్యం కేసులో నలుగురి అరెస్ట్‌

13 May, 2022 09:25 IST|Sakshi
ప్రొద్దుటూరులో నిందితుల అరెస్ట్‌ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న ఏఎస్పీ నీలం పూజిత 

నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు

మీడియా అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం

జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్, ఏఎస్పీ నీలం పూజిత వెల్లడి

ప్రొద్దుటూరు క్రైం/కడప అర్బన్‌/సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారానికి సంబంధించిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులు.. పఠాన్‌ సాధక్, షేక్‌ అబ్దుల్‌ రసూల్, బత్తల సిమోన్, బి.సిపాయి చిన్నయ్య ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో ఉండగా అదుపులోకి తీసుకున్నట్టు ఏఎస్పీ నీలం పూజిత తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు ఆమె వివరాలను వెల్లడించారు. విచారణలో భాగంగా తనపై నలుగురు అత్యాచారం చేసినట్లు బాలిక వెల్లడించిందన్నారు.
చదవండి: ​కాకినాడ: సర్పవరం ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య

నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా, నిందితులపై కేసు నమోదు చేశాక మీడియాలో స్క్రోలింగ్‌ వచ్చిందని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాక అసత్యాలు ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కడపలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4న ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ సీఐ నాగరాజుకు ఫోన్‌ కాల్‌ వచ్చిందన్నారు.

ఆ ప్రాంత అంగన్‌వాడీ టీచర్‌ ద్వారా సమాచారం అందుకున్న మహిళా పోలీసు మల్లేశ్వరి ఒక మైనర్‌ బాలిక గర్భంతో ఉండి  వీధుల్లో తిరుగుతోందని సీఐకి సమాచారం ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన సీఐ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకురమ్మని మహిళా పోలీసుకు సూచించారన్నారు. అయితే బాలిక మానసికస్థితి సరిగా లేకపోవడంతో తన వివరాలను పోలీసులకు వెల్లడించలేకపోయిందన్నారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఎవరో తేలకపోవడంతో సంరక్షణ నిమిత్తం బాలికను మైలవరంలోని డాడీహోంకు తరలించామన్నారు.

తండ్రి మానసిక స్థితి కూడా సరిగా లేదు..
ఈ నెల 9న త్రీటౌన్‌ పరిధిలో ఉన్న బాలిక తండ్రిని గుర్తించి సమాచారం ఇచ్చామని ఎస్పీ అన్బురాజన్‌ చెప్పారు. అయితే అతడి మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో ఫిర్యాదు ఇవ్వలేకపోయాడన్నారు. దీంతో ఐసీడీఎస్‌ సీడీపీవో హైమావతి ఫిర్యాదు మేరకు ఈ నెల 11న ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ క్రమంలో బయటి వ్యక్తులకు వెళ్లిన పలు వీడియోలను పరిశీలించి కేసులో సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాలిక తల్లి ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించిందని చెప్పారు. బాలికకు ఆరు నెలలుగా ఒక వ్యక్తితో పరిచయం ఉందని.. అతడు అనుభవించి మోసం చేశాడన్నారు. అంతేకాకుండా అతడి ఇద్దరు బంధువులు కూడా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు. నాలుగు నెలల క్రితం ఇంకో వ్యక్తి 20 రోజుల పాటు బాలికను పనిమనిషిగా పెట్టుకొని మోసం చేశాడన్నారు.

దర్యాప్తును వేగవంతం చేయండి: వాసిరెడ్డి పద్మ
కాగా, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ.. ఎస్పీ అన్బురాజన్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని కోరారు. బాలిక ఆరోగ్యం కుదుటపడేవరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మహిళా కమిషన్‌ సభ్యురాలు గజ్జల లక్షి్మని హుటాహుటిన బాధిత బాలిక వద్దకు పంపారు. ఈ కేసును కమిషన్‌ సుమోటోగా స్వీకరిస్తుందని.. బాధితురాలికి అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు