వీడిన మిస్టరీ: ‘కోరిక’ తీర్చాలని బలవంతం చేయడంతో..

27 Nov, 2021 07:04 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ  

వీడిన విద్యార్థి నేత తిరుపాల్‌ హత్య మిస్టరీ

ప్రేమ వ్యవహారంలో జోక్యం.. డబ్బు కోసం బెదిరింపు

నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఉరవకొండ(అనంతపురం జిల్లా): జిల్లాలో సంచలనం రేపిన విద్యార్థి సంఘం నేత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ప్రేమ జంటను డబ్బు కోసం బెదిరించడంతోపాటు తన ‘కోరిక’ తీర్చాలని బలవంతం చేయడం వల్లే విద్యార్థి సంఘం నేత తిరుపాల్‌ను హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఉరవకొండ సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ నర్సింగప్ప, సీఐ శేఖర్‌ మీడియాకు వెల్లడించారు. వజ్రకరూరుకు చెందిన మండ్ల తిరుపాల్‌ యునైటెడ్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ నాయకుడు. ఇదే గ్రామానికి చెందిన బెస్త గురుమూర్తి ఒక అమ్మాయిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి వ్యవహారం తిరుపాల్‌కు తెలిసింది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలపకుండా ఉండడానికి డబ్బు డిమాండ్‌ చేశాడు. అంతే కాదు గురుమూర్తి ప్రేమించిన అమ్మాయితో తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు.

చదవండి: అమ్మా నేను చనిపోతున్నా.. నన్ను క్షమించు..

బెదిరింపులు తట్టుకోలేక.. 
అడిగినంత డబ్బుతో పాటు కామవాంఛ తీర్చాలన్న తిరుపాల్‌ బెదిరింపులను గురుమూర్తి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఇతడిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. తమ గ్రామానికి చెందిన కురుబ ఆవుల ఎర్రిస్వామిని సంప్రదించి రూ.3.50 లక్షలతో తిరుపాల్‌ హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు ఎర్రిస్వామి తన స్నేహితులు చాకలి సునీల్, మఠం వేణుగోపాల్‌తో కలిసి అక్టోబర్‌ 24న పార్టీ చేసుకుందామని తిరుపాల్‌ను వజ్రకరూరు గ్రామంలోని చింతలపల్లి రోడ్డులో గల కనుమ మిట్ట వద్దకు పిలుచుకెళ్లారు. అక్కడ కత్తులతో పొడిచి, గొంతు కోసి తిరుపాల్‌ను చంపేశారు.

మృతదేహం ఆనవాళ్లు దొరక్కుండా షర్టుతో చేతులు కట్టి, తల నుంచి నడుము వరకు సంచిలోకి దూర్చి, నడుము నుంచి కాళ్ల వరకు చీరతో చుట్టి.. ఆ చీరకు బరువైన రాయిని కట్టి కమలపాడు గ్రామానికి చెందిన కురుబ నాగప్ప పొలంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. తిరుపాల్‌కు చెందిన బజాజ్‌ సీటీ 100 మోటార్‌ బైక్‌ను, హత్యకు ఉపయోగించిన కత్తులను కూడా అందులోనే వేశారు. తిరుపాల్‌ కనిపించడం లేదన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వజ్రకరూరు పోలీస్‌ స్టేషన్‌లో ‘మిస్సింగ్‌’ కేసు నమోదైంది. ఎస్పీ ఆదేశాల మేరకు గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప పర్యవేక్షణలో ఉరవకొండ సీఐ శేఖర్, వజ్రకరూర్‌ ఎస్‌ఐ వెంకటస్వామిలు విచారణ చేపట్టారు.

వజ్రకరూరులోని రైతు భరోసా కేంద్రం వెనక ఖాళీ స్థలంలో నలుగురు నిందితులు (గురుమూర్తి, ఆవుల ఎర్రిస్వామి, చాకలి సునీల్, మఠం వేణుగోపాల్‌)ను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి పల్సర్‌ బైక్, రెండు కత్తులు, రెండు బంగారు ఉంగరాలు, రెండు వెండి కడియాలు, వెండి చైనుతో పాటు రూ.80వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపాలు హత్య కేసులోని నిందితులపై గతంలో పలు దారిదోపిడీ కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు.

సీఐ, ఎస్‌ఐలకు రివార్డు.. 
హత్య కేసు మిస్టరీని ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన ఉరవకొండ సీఐ శేఖర్, వజ్రకరూరు ఎస్‌ఐ వెంకటస్వామి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు.  

మరిన్ని వార్తలు