ఈతకు వెళ్లి నలుగురు బాలల మృత్యువాత

12 Jun, 2022 04:58 IST|Sakshi

ప్రాణాలతో బయటపడ్డ మరో ఇద్దరు      

ప్రకాశం జిల్లాలో ఘటన

శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు గల్లంతు

అక్కచెరువుపాలెం (కొండపి, జరుగుమల్లి)/రణస్థలం: ఈత సరదా నలుగురు బాలల ప్రాణాలను బలిగొంది. ఈతకొట్టేందుకు చెరువులోకి దిగిన ఆరుగురిలో నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చింతల కౌషిక్‌ (16), మద్దినేని సుబ్రహ్మణ్యం (16), మద్దినేని చందనశ్రీ (16), చీమకుర్తి మండలం బూసరపల్లికి చెందిన మున్నంగి శివాజీ (12), మున్నంగి చందన (14), దర్శి మండలం బసవన్నపాలెంకు చెందిన అబ్బూరి హరి భగవాన్‌ నారాయణ (11) శనివారం అక్కంచెరువుపాలెంలోని ఓ భవనం వద్ద ఆడుకున్నారు.

సాయంత్రం 5 గంటల తర్వాత గ్రామానికి తూర్పున ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. ముందుగా చెరువులో కౌషిక్, సుబ్రహ్మణ్యం, శివాజీ, హరిభగవాన్‌ నారాయణ దిగారు. ఈతకొడుతున్నట్లుగా ముందుకు పోయారు. వారి తర్వాత చందనశ్రీ,, చందనలు సైతం చెరువులోకి దిగారు. చెరువులో ముందుకెళ్లిన బాలురు లోతులో మునుగుతూ భయంతో కేకలు వేశారు. బాలికలు సైతం మునిగిపోతూ కేకలు వేయటం ప్రారంభించారు.

చెరువుకు కూతవేటు దూరంలో చేలో పని చేసుకుంటున్న ప్రసాద్‌ విషయం గమనించి.. పరుగున చెరువులోకి దిగి ఒడ్డుకు దగ్గరలో ఉన్న బాలికలను రక్షించి బయటకు తీశాడు. ఈతరాని ప్రసాద్‌ అప్పటికే అలసి కేకలు వేయడంతో గ్రామస్తులు చెరువు వద్దకు పరుగున వచ్చారు. ఈ క్రమంలో చెరువులోకి దిగి బాలురను బయటకు తీయగా అప్పటికే చింతల కౌషిక్, మున్నంగి శివాజీ మృతి చెందారు.

కొన ఊపిరితో ఉన్న మద్దినేని సుబ్రహ్మణ్యం, అబ్బూరి హరి భగవాన్‌ నారాయణను కారులో కందుకూరు వైద్యశాలకు తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన చందనశ్రీ,, చందన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్‌సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు. 

సముద్రంలో ముగ్గురు గల్లంతు
కాగా, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్‌జీఆర్‌పురం పంచాయతీలో గల పోతయ్యపేట సముద్ర తీరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలానికి చెందిన తిరుపతి గణేష్‌ శనివారం తన మేనకోడలు దీవెనను తీసుకుని అత్తవారింటికి వచ్చారు.

సాయంత్రం పోతయ్యపేట సముద్ర తీరానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. అందరూ స్నానాలు చేస్తుండగా గణేష్‌తోపాటు ఆయన కుమార్తె మానస (9), మేనకోడలు దీవెన (18) ఒక్కసారిగా గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు పడవలపై వెళ్లి గాలించినా ఫలితం కనిపించలేదు. గాలింపు చర్యలను ఎస్‌ఐ జి.రాజేష్‌ పర్యవేక్షిస్తున్నారు. 

మరిన్ని వార్తలు