విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి.. ఒకరిని కాపాడబోయి ఒకరు

3 Oct, 2022 09:44 IST|Sakshi

యాచారం: ఈత సరదా నలుగురు చిన్నారులను బలి తీసుకుంది. చెరువులో పెద్ద గుంత ఉన్న విషయం తెలియక ఈతకు వెళ్లిన వారిలో ఒకరు మునిగిపోతుండగా కాపాడబోయి ఒకరి తర్వాత మరొకరు వరుసగా నలుగురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి అనుబంధ గ్రామం గొల్లగూడలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

యాచారం సీఐ లింగయ్య కథనం ప్రకారం.. గొల్లగూడకు చెందిన ఎండీ కాశీం, బీబీ జానీ దంపతుల కుమారుడు కహ్లీద్‌ (12), కూతురు సమ్రీన్‌ (14), కాశీం సోదరుడు రజాక్, హస్మ దంపతుల కుమారుడు రెహాన్‌ (10), వారి సమీప బంధువైన ఎస్‌కే హుస్సేన్, పార్‌జాన్‌ దంపతుల కుమారుడు ఇమ్రాన్‌(9) ఆదివారం మధ్యాహ్నం కొంతమంది బంధువులతో కలసి గ్రామ సమీపంలోని దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. తిరిగి గ్రామానికి వచ్చేటప్పుడు కహ్లీద్, సమ్రీన్, రెహాన్, ఇమ్రాన్‌ ముందుగా బయలుదేరారు. సమీపంలో ఉన్న ఎర్రకుంట వద్దకు వచ్చి సరదాగా ఈత కొట్టడానికి అందులోకి దిగారు. భారీ వర్షాలతో కుంట పూర్తిగా నిండిపోయి ఉంది. చెరువులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

ఈత కోసం కుంటలోకి దిగిన ఓ బాలుడు మునిగిపోతుండగా గమనించిన మిగతావారు కేకలు వేస్తూ అతడిని కాపాడబోయి ఒకరి తర్వాత ఒకరు నలుగురూ మునిగి పోయారు. అదే సమయంలో వారితో కలసి ఈత కొట్టడానికి కొంత ఆలస్యంగా వచ్చిన మరో బాలుడు అయాన్‌ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి గ్రామానికి వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, సమీపంలోని వ్యవసాయ బావి వద్ద పనిచేస్తున్న రైతు లక్ష్మయ్య చిన్నారుల అరుపులు విని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చేసరికే నలుగురు చిన్నారులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.

ఒకేరోజు నలుగురు పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్నారులను విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు.
చదవండి: షాకింగ్‌ ఘటన.. రెండో భార్యను లాడ్జికి తీసుకెళ్లి..

మరిన్ని వార్తలు