పెద్దలతో పాటు బట్టలు ఉతికేందుకు వెళ్లిన చిన్నారులు

27 Jul, 2021 20:20 IST|Sakshi
రాలిన పసి మొగ్గలు : షర్మిల, మహేందర్, వెంకటలక్ష్మి, జాహ్నవి (భవ్య) (ఫైల్‌ ఫొటోలు)

నలుగురు చిన్నారులను మింగేసిన పెద్దేరు

తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

సాక్షి, విశాఖపట్నం: అంతవరకు ఆనందంగా చిందులేసిన చిన్నారుల ముఖాలు వాడిపోయాయి.. నిత్యం కిలకిల నవ్వులతో తల్లిదండ్రులకు కన్నుల పండువగా నిలిచే ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి.. నలుగురు చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది.. మాడుగుల మండలం జమ్మదేవిపేట పంచాయితీ లోవ గవరవరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెద్దేరు కాలువకు దుస్తులు ఉతకడానికి వెళ్లారనుకొని వంతాల వెంకట ఝాన్సీ (10), వంతాల వెంకటగౌతమ్‌ షరి్మల (భవ్య) (7), వంతాల జాహ్నవి (11), నీలాపు మహీధర్‌ (7) ప్రమాద స్థలానికి వెళ్లారు. అక్కడ తల్లిదండ్రులు లేకపోవడంతో నీటిలో దిగి ప్రమాదానికి లోనయ్యారు. వారంతా దగ్గరి బంధువులే.. వరుసకు అన్నదమ్ముల పిల్లలే. గంట వ్యవధిలోనే ఈ దారుణం జరిగింది. నాలుగు కుటుంబాల్లో కలత రేపింది.  

తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం 
వంతాల వెంకట ఝాన్సీ తల్లిదండ్రులకు ఏౖMðక కుమార్తె. కూలినాలి చేసి గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదివిస్తున్నారు. ఉన్నత చదువులు చదివించాలనున్న ఆశయం ఆదిలోనే నీరిగారిపోయిందని తండ్రి చినబాబు రోదిస్తున్నాడు. వంతాల వెంకట గౌతమ్‌ç Üషరి్మల అక్క రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తమ్ముడున్నాడు. నీలాపు మహేందర్‌ రెండో తరగతి చదువుతున్నాడు. ఒక్కడే కొడుకు కావడంతో తండ్రి నాగరాజుకు పోడు వ్యవసాయం చేసి చదివిస్తున్నాడు. వంతాల జాహ్నవి (భవ్య) తల్లిదండ్రులతో చింతపల్లి మండలం రాజుపాకలు గ్రామంలో ఉంటోంది. కరోనా వల్ల బడులు లేకపోవడంతో బంధువుల ఇంటికి గవరవరం వచ్చి, ఈ ప్రమాదానికి లోనైంది.

పిల్లలకు పోస్టుమార్టం వద్దని ఎంపీడీఓ ఎం.పోలినాయుడు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ సత్యనారాయణలను తల్లిదండ్రులు కోరారు. పెద్దల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయిస్తామని వారు బదులిచ్చారు. ఎస్‌ఐ పి.రామారావు, సర్పంచ్‌ కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ పార్టీ మండల అధ్యక్షుడు తాళ్ళపురెడ్డి వెంకట రాజారామ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో చిన్నారులను ఒడ్డుకు చేర్చారు. ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

ప్రమాదాలకు నిలయం 
మాడుగుల రూరల్‌: పెద్దేరు జలాశయం పరిసర ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. ఈ రిజర్వాయర్‌ నుంచి వచ్చే కాలువలు మృత్యునిలయాలవుతున్నాయి. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ నీటి లోతు గురించి తెలియక చిక్కుల్లో పడుతున్నారు. లోవ గవరవరం వద్ద సోమవారం నలుగురు చిన్నారులు జలసమాధి అయిన దారుణం ఒక్కటే కాదు.. ఈ నెల 11న బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట వద్ద నదిలోకి దిగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 2018లో లోవ కొత్తపల్లి మావూళ్లమ్మ గుడి ప్రాంతంలో విహార యాత్రకు వచ్చిన ముగ్గురు యువ ఇంజినీర్లు ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు నీటి ప్రవాహం పెరిగినప్పుడు కూడా గతంలో ఇద్దరు పెద్దేరు నది లో పడి గల్లంతయ్యారు. కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడి ప్రమాద పరిస్థితి గురించి తెలుస్తుందని స్థానికులు సూచిస్తున్నారు.     

మరిన్ని వార్తలు