హైవేపై మృత్యుఘోష.. నలుగురు దుర్మరణం

1 Nov, 2022 02:00 IST|Sakshi

వెనుకనుంచి కారును ఢీకొట్టిన లారీ

ముందున్న కంటెయినర్‌లో చిక్కుకుని నుజ్జునుజ్జయిన కారు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు డ్రైవర్‌ మృతి

మృతుల్లో ఆదిలాబాద్‌ జెడ్పీ డీఈ, ఆయన కూతురు 

పరామర్శకు వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలంలో ఘటన

గుడిహత్నూర్‌(బోథ్‌): సమీప బంధువు అనారోగ్యానికి గురవడంతో పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం సీతాగోంది వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని మసూద్‌ నగర్‌కు చెందిన సయ్యద్‌ రఫతుల్లా అహ్మద్‌ (56) పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

సమీప బంధువు అనారోగ్యానికి గురవడంతో ఆయనను పరామర్శించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తన ఇద్దరు కుమార్తెలు శబియా హష్మీ, జుబియా హష్మీ, తమ్ముని కొడుకు సయ్యద్‌ వజాహద్, డ్రైవర్‌ శంషోద్దీన్‌తో కలిసి ఆదిలాబాద్‌కు బయలుదేరారు. ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మండలంలోని సీతాగోంది మూలమలుపు వద్దకు రాగానే వీరి కారును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది.

దీంతో కారు.. ముందున్న కంటెయినర్‌ లారీ లోపలికి చొచ్చుకు పోయింది. వెనుకా ముందు లారీల మధ్యలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో డ్రైవర్‌ శంషోద్దీన్‌ (50), శబియా హష్మీ (26), తమ్ముని కొడుకు సయ్యద్‌ వజాహద్‌ (17) అక్కడికక్కడే ప్రాణాలు వది లారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే  పోలీసులు వచ్చి కారులో ఇరు క్కుపోయిన సయ్యద్‌ రఫతుల్లా అహ్మద్‌ (56), జుబియాను  ఘటనా స్థలం నుంచి రిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి రఫతుల్లా అహ్మద్‌ చనిపోయారు.

జుబియా హష్మీ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృత దేహాలను బయటకు తీసేందుకు సుమారు 2 గంటల పాటు స్థానికులు, పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి కారణమైన లారీ కొద్ది దూరంలో బోల్తా కొట్టింది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ప్రమాద స్థలంలోనే మరో ప్రమాదం
కాగా, ప్రమాద స్థలంలోనే సోమవారం ఉదయం వేగంగా వెళ్తున్న ఓ లారీడ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనక నుంచి వేగంగా వస్తున్న కంటెయినర్‌ లారీని ఢీకొట్టింది. దీంతో కంటెయినర్‌ వెనుక ఉన్న మరో కంటెయినర్‌ సైతం ఢీకొట్టింది. ఇలా వరుసగా మూడు లారీలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో మధ్యలో ఉన్న లారీడ్రైవర్‌ ఎడమకాలు వాహనంలో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు