మహబూబ్‌నగర్‌ జిల్లాలో హైవేపై ట్రక్కు బీభత్సం

18 Jun, 2021 22:59 IST|Sakshi

సాక్షి, జడ్చర్ల: ఓ ట్రక్కు జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ధాన్యం అమ్ముడుపోక తిరిగి వెళుతున్న ట్రాక్టర్‌ను, ఎదురుగా వస్తున్న బైక్, స్కూటీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్‌ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు విస్తరణ పనులకు మెటీరియల్‌ను అన్‌లోడ్‌ చేసి వస్తున్న కాంక్రీట్‌ రెడీమిక్స్‌ ట్రక్కు.. ముందుగా ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్‌ ట్రక్కును నియంత్రించకపోవడంతో అదే వేగంతో ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను సైతం ఢీ కొట్టి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ బాలయ్యకు తోడుగా వచ్చిన సురేశ్‌ (20) ధాన్యం బస్తాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వస్తున్న రవికుమార్‌ (20), స్కూటీపై వస్తున్న బన్‌రెడ్డి వెంకటేశ్వర్‌రావు (32), అతని తండ్రి (52) సైతం దుర్మరణం చెందారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ బాలయ్య, ట్రక్కు డ్రైవర్, క్లీనర్‌లు గాయపడ్డారు. కాగా, మహబూబ్‌నగర్‌ డీఎస్పీ శ్రీధర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు