అతివేగం.. తీసింది నలుగురి ప్రాణం

31 Aug, 2020 15:20 IST|Sakshi
కంటైనర్‌ కిందకు దూసుకుపోయి నుజ్జునుజ్జైన కారు

సాక్షి, చిత్తూరు : కొత్త స్థలం కొన్నామనే సంతోషం ఆ కుటుంబానికి ఎంతో సేపు నిలవలేదు. రిజిస్టేషన్‌ కాకుండానే ఆ కుటుంబం కానిరాని లోకాలకు చేరుకుంది. బంగారుపాళెం మండలం పాలమాకులపల్లె వద్ద ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆగిఉన్న కంటైనర్‌ వెనుక కారు సగందాకా దూసుకుపోవడం చూస్తుంటే కారు వేగం వంద కిలోమీటర్లకు పైగానే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు కారు ముందుసీట్లో కూర్చున తండ్రీ కొడుకులు సీటు బెల్ట్‌ ధరించి ఉన్నారు. ఎదురుగా వచ్చిన టీవీఎస్‌ మోపెడ్‌ను చూసిన వెంటనే వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అదుపు తప్పి ఘోర ప్రమాదానికి గురయ్యారు. మోపెడ్‌పై వెళుతున్న వ్యక్తితో సహా కారులోని మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

వెనుకడోర్‌ తెరుచుకోవడంతో దక్కిన ప్రాణాలు
ప్రమాదం జరిగిన కారులో వెనుకవైపు కూర్చున శిరీష మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడింది. ముందు కూర్చున వారు సీట్‌ బెల్టు ధరించారు. వెనుకవైపు కూర్చున అత్తాకోడళ్లు మాత్రం బెల్టు పెట్టుకోనట్టు కనిపిస్తోంది. అయినా వేగంగా ఢీకొన్న ధాటికి కారు వెనుకడోర్‌ ఒకటి మాత్రం ఓపెన్‌ కావడంతోనే శిరీష కారులోంచి రోడ్డుపై పడి గాయాల పాలైంది.

హైవేపై అవగాహ లేకపోవడం
పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్‌ నుంచి కేజీ సత్రం వరకు జరిగే ప్రమాదాలను పరిశీలిస్తే ఎక్కువగా బయటి ప్రాంతాలకు చెందిన వారివే కావడం గమనార్హం! సాధారణంగా బెంగళూరు సిటీ దాటాక హొస్‌కోట్‌ నుంచి జాతీయ రహదారి వేగంగా వాహనలను నడిపేందుకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అక్కడి నుంచి రాష్ట్ర సరిహద్దు నంగిళిదాకా వాహనాలు వంద కిలోమీటర్లకంటే ఎక్కువ వేగంతో వస్తుంటాయి. ఆపై రాష్ట్ర సరిహద్దు నుంచి చిత్తూరు బైపాస్‌ దాకా ఇటీవల నిర్మించిన పనుల కారణంగా హైవేలో ఎక్కడెక్కడ మార్గం ఎలా ఉందనే దానిపై కర్ణాటక నుంచి వచ్చే వాహనదారులకు పెద్దగా అవగాహన ఉండదు. అక్కడి రోడ్డులాగే ఉంటుందని భావించి వందకుపై వేగంగా రావడం ఇక్కడి హైవేలో ప్రమాదాలకు గురికావడం కొంతకాలంగా చోటుచేసుకుంటోంది. ఏదేమైనా మితిమీరిన వేగం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది.

బాధితులను ఓదార్చిన ఎమ్మెల్యే బాబు
రోడ్డు ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు బంగారుపాళెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీషను పరామర్శించి ఓదార్చారు. అక్కడే ఉన్న మృతుడు శ్రీనివాసరెడ్డి పెద్దకుమారుడు వివేకానందరెడ్డితో మాట్లాడారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం చేయించాలని డాక్టర్లు, పోలీసులను ఆదేశించారు. అలాగే మృతదేహాలను వారి స్వగామమైన ఉదయగిరికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు పోలీసులకు సూచించారు. 

ప్రాణాలు కాపాడని ఎయిర్‌ బెలూన్లు 
వోల్వో కంపెనీకి చెందిన ఖరీదైన కారులో నాణ్యమైన ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ అయి పగిలి పోయాయంటే మితిమీరిన వేగమే దుర్ఘటనకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి కారు బోల్తా కొట్టినా లేక ముందుభాగం ఒత్తిడికి గురైనా బెలూన్లు విచ్చుకుని లోపలున్న వారికి రక్షణ కవచంలా మారుతాయి. కానీ ఈ ఘటనలో కారులోని వారి ప్రాణాలకు ఇవి రక్షించలేకపోయాయి.

నా బావ ఎక్కడ..?
రోడ్డు ప్రమాదంలో అత్త, మామ, భర్త చనిపోయారు. గాయపడిన శిరీషను అపస్మాకర స్థితిలో ఉండడంతో 108లో బంగారుపాళెం ఆసుపత్రికి తరలించారు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన శిరీష ‘‘నా బావ ఏడీ.. అత్త, మామకు ఏమైంది? ఎలా ఉన్నారు... బావా ఎక్కడ?’’ అంటూ అక్కడకు వచ్చిన వారిని  ఆత్రుతగా అడుగుతూ, కన్నీటిపర్యంతమై చుట్టు పక్కలా వెతుకుతుంటే అక్కడికి చేరుకున్న స్థానికులు విచలితులయ్యారు. వాస్తవానికి శిరీషకు ఏడునెలల క్రితమే వెంకటేష్‌రెడ్డితో వివాహమైంది. విధి చిన్నచూపు చూసి ప్రమాదంలో ఆమె భర్తను సైతం కబళించింది.  

మరిన్ని వార్తలు