ప్రాణస్నేహితులు.. విధి ఆడిన ఆటలో ఆ నలుగురు నాలుగేళ్లలో...

23 May, 2022 16:13 IST|Sakshi
శేఖర్‌ రెడ్డి(ఫైల్‌), ప్రమాదాల్లో చనిపోయిన సురేంద్రరెడ్డి, వెంకటాచలం రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, శేఖర్‌ రెడ్డి (ఫైల్‌)

చంద్రగిరి(చిత్తూరు జిల్లా): ఆ నలుగురు ప్రాణస్నేహితులు.. వారి స్నేహాన్ని చూసి స్థానికులు ముచ్చట పడేవారు. అలాంటి వారు విధి ఆడిన ఆటలో ఓడిపోయారు. ఆ నలుగురూ నాలుగేళ్లలో వేర్వేరు ప్రమాదాల్లో మృత్యుఒడికి చేరుకున్నారు. వివరాల్లోకెళ్తే.. రామచంద్రాపురం మండలం ఉప్పలవంకకు చెందిన సురేంద్ర రెడ్డి, వెంకటాచలం రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, శేఖర్‌రెడ్డి చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీరు వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకునేవారు. 2018లో ఉప్పలవంక సమీపంలో బైక్‌పై వస్తున్న సురేంద్ర రెడ్డిని ట్రాక్టర్‌ ఢీకొనడంతో మృతి చెందాడు.
చదవండి: పెళ్లి మధ్యలో సొమ్మసిల్లిన వరుడు.. వధువుకి షాక్‌, ఆగిపోయిన పెళ్లి

2021లో గ్రామ సమీపంలోని బావిలో మోటారు తెస్తుండగా వెంకటాచలంరెడ్డి మృతిచెందాడు. చంద్రగిరి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజశేఖరరెడ్డి అక్కడికక్కడే చనిపోగా, శేఖర్‌రెడ్డి(27) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని తిరుపతి రుయాకు తరలించారు. అక్కడి నుంచి స్విమ్స్‌కు, మళ్లీ వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించాలని సూచించారు. చెన్నై తరలిస్తుండగా ఆదివారం ఉదయం మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్లలో నలుగురు స్నేహితులు వివిధ ప్రమాదాల్లో మృతి చెందడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. వారి కుటుంబ సభ్యులు మనోవేదన చెందుతున్నారు.  

మరిన్ని వార్తలు