యూట్యూబ్‌లో చూసి.. బ్యాంక్‌కు టోపీ వేసి!

11 Aug, 2022 02:55 IST|Sakshi

మూడు డొల్ల కంపెనీలు సృష్టించిన కేటుగాళ్లు 

క్రెడిట్‌ కార్డులతో రూ.1.33 కోట్ల నగదు డ్రా 

ఈ సొమ్ముతోనే సొంతిల్లు, రెండు కార్లు కొనుగోలు 

నలుగురిని అరెస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు  

సాక్షి, సిటీబ్యూరో: యూట్యూబ్‌లో చూసి బ్యాంకుకు పంగనామం ఎలా పెట్టాలో నేర్చుకున్నాడు ఓ కేటుగాడు. డొల్ల కంపెనీలను స్థాపించి, నకిలీ ఉద్యోగులను సృష్టించి.. వారి పేర్ల మీద డెబిట్, క్రెడిట్‌ కార్డ్‌లను తీసుకొని.. ఏకంగా రూ.1.33 కోట్ల నగదును కొట్టేశాడు. ఈ సొమ్ముతోనే వరంగల్‌లో రూ.40 లక్షలతో సొంతిల్లు, రెండు లగ్జరీ కార్లనూ కొనుగోలు చేశాడు. పూర్తి వివరాలు రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ కే మురళీధర్‌తో కలిసి సీపీ మహేశ్‌ భగవత్‌ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన బోడ శ్రీకాంత్‌ కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌లో నివాసముంటున్నాడు. అక్రమ మార్గంలో డబ్బు ఎలా సంపాదించాలని యూట్యూబ్‌లో పరిశోధించిన శ్రీకాంత్‌.. ఆఖరికి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి మీద రుణాల తీసుకొని బ్యాంక్‌లకు టోకరా వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన బానోతు సుమన్, వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన ఎడ్ల బిక్షపతి (మరణించాడు)లకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించి, వారి ఆధార్, పాన్‌ కార్డ్‌లను సేకరించాడు. వీటి సహాయంతో సుమన్, బిక్షపతిలు ప్రొప్రైటరీలుగా మేడిపల్లిలో లివింగ్‌ ఇంటీరియర్‌ డిజైనర్, నారపల్లి చౌదరిగూడలో ఎల్లో ల్యాప్‌ ఇంటీరియర్‌ డిజైనర్, మణికొండ శివపురి కాలనీలో బ్రిక్‌ అండ్‌ రాక్‌ ఇంటీరియర్స్‌ పేర్లతో డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశాడు. లేబర్‌ లైసెన్స్‌లను కూడా పొందాడు. 

ఈ డొల్ల కంపెనీలో ఉద్యోగుల నమోదు కోసం... శ్రీకాంత్‌ తన స్వస్థలంలోని తండాలకు వెళ్లి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని తండావాసులు, నిరక్షరాస్యులను నమ్మించి వారి ఆధార్‌ కార్డులను సేకరించాడు. ఈ వ్యవహారంలో వరంగల్‌ జిల్లా నాంచారిమడూరు గ్రామానికి చెందిన భూక్యా నగేష్‌ శ్రీకాంత్‌కు సహాయపడేవాడు. ఇందుకు గాను ప్రతి క్రెడిట్‌ కార్డ్‌కు రూ.1000 కమీషన్‌ తీసుకునేవాడు. 

53 మంది ఆధార్‌ కార్డ్‌లతో డొల్ల కంపెనీలలో ఉద్యోగులుగా నమోదు చేశాడు. వారి పేర్ల మీద ఐసీఐసీఐ హబ్సిగూడ, ఉప్పల్, రామాంతపూర్‌ బ్రాంచీలలో శాలరీ బ్యాంక్‌ అకౌంట్లు తెరిచాడు. క్రెడిట్‌ కార్డ్‌లను కూడా తీసుకున్నాడు. క్రెడిట్‌ కార్డ్‌ల రుణ పరిమితి అర్హతను పెంచేందుకు 34 క్రెడిట్‌ కార్డ్‌దారులలో ప్రతి నెలా రూ.లక్ష, రూ.2 లక్షల జీతం వేసేవాడు. క్రెడిట్‌ లిమిట్‌ పెరగగానే రూ.1.33 కోట్లు నగదును ఉపసంహరించాడు. శ్రీకాంత్‌ స్నేహితుడైన నాచారంలోని భవానీనగర్‌కు చెందిన గౌతమ్‌ అతని భార్య తిర్చి దీపిక పేరు మీద బ్యాంక్‌ నుంచి రుణం పొంది, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టాడు. 

తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవటంతో వెరిఫికేషన్‌ కోసం వెళ్లి బ్యాంక్‌ అధికారులకు దిమ్మతిరిగిపోయింది. అసలక్కడ లివింగ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌ కంపెనీయే లేదని తెలుసుకొని షాకయ్యారు. వెంటనే హబ్సిగూడ ఐసీఐసీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ శ్యామ్‌ సుంకర నాచారం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన మల్కజ్‌గిరి ఎస్‌ఓటీ, నాచారం పోలీసులు... ప్రధాన నిందితుడు శ్రీకాంత్, సుమన్, నగేష్, గౌతమ్‌లను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 93 డెబిక్‌ కార్డ్‌లు, 3 క్రెడిట్‌ కార్డ్‌లు, రెండు కార్లు, 28 పాన్‌ కార్డ్‌లు, 54 ఆధార్‌ కార్డ్‌లు, 24 కంపెనీ గుర్తింపు కార్డులు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు