అంతులేని విషాదం.. కుటుంబం మొత్తం..

27 Sep, 2022 09:28 IST|Sakshi
ప్రమాదంలో మృతిచెందిన నూక ఉమామహేశ్వరరావు, నూక రేవతి, చిన్నారులు షర్మిల , దుర్గాప్రసాద్‌(ఫైల్‌)

సాక్షి, జంగారెడ్డిగూడెం: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగం ఒక కుటుంబంలో  అంతులేని విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యులంతా మృతిచెందడంతో హృదయవిదారకర పరిస్థితి నెలకొంది. ఈ నెల 25న దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా మృతిచెందిన ఘటన ఇది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన నూక ఉమామహేశ్వరరావు(35), ఆయన భార్య రేణుక(28), వారి పిల్లలు షర్మిల(9), దుర్గాప్రసాద్‌(8) ఈ ప్రమాదంలో మృతిచెందారు.

బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లి దర్శనం చేసుకుని ఈ నలుగురు ఒకే మోటార్‌సైకిల్‌పై తిరిగి స్వగ్రామం వెళ్తున్నారు. మరో బైక్‌పై ఉమామహేశ్వరరావు తండ్రి నూక గణపతి, తల్లి లక్ష్మిలు వెళ్తున్నారు. కామవరపుకోట మండలం బొర్రంపాలెం అడ్డరోడ్డు వద్దకు వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న కారు ఉమామహేశ్వరరావు కుటుంబం ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు షర్మిల, దుర్గాప్రసాద్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఉమామహేశ్వరరావు రేవతిలను మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

ఏలూరు సమీపంలోకి వెళ్లే సరికి ఉమామహేశ్వరరావు పరిస్థితి విషమించడంతో వెంటనే ఏలూరు జనరల్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఉమామహేశ్వరరావు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన భార్య రేవతిని విజయవాడ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.  కుటుంబం మొత్తం మృతిచెందడంతో ఉమామహేశ్వరరావు తల్లితండ్రులు గణపతి, లక్ష్మిలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీర్జాపురంలో ఉమామహేశ్వరరావు భార్య రేవతి పేరున జగనన్న కాలనీ మంజూరైంది. ఇటీవలే ఇంటి నిర్మాణం కోసం కుటుంబసభ్యులతో ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. నిర్మాణం ప్రారంభించకుండానే కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఉమామహేశ్వరరావు సొంతింటి కల నెరవేరకుండానే కుటుంబం అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.  

పోలీసుల అదుపులో కారు డ్రైవర్‌ 
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ వేముల బాల గంగాధర్‌ తిలక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ప్రమాదంలో గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాదం సమయంలో కారులో తనతోపాటు మరో ముగ్గురు ఉన్నారని అంతా భయపడి పారిపోయామని డ్రైవర్‌ తిలక్‌ చెబుతున్నాడు. ఘటనపై తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఇన్‌ఛార్జ్‌ సీఐ ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు చెప్పారు.

డ్రైవర్‌ బాలగంగాధర్‌ తిలక్‌కు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి కోలుకున్న తరువాత అరెస్టు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చిన్నారులు షర్మిల, దుర్గాప్రసాద్‌ మృతదేహాలకు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో, ఉమామహేశ్వరరావు మృతదేహానికి ఏలూరు ఆసుపత్రిలో, రేవతి మృతదేహానికి విజయవాడ ఆసుపత్రిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాలను ఉమామహేశ్వరరావు తండ్రి గణపతికి అప్పగించినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. 

మరిన్ని వార్తలు