అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్‌.. గంటల్లో..

24 Aug, 2021 16:22 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు (ఫొటో The Hindu)

చెన్నె: ఇటీవల కొత్త తరహా నేరాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త తరహాలో నేరాలు జరుగుతుండడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. అయితే సినిమాల్లో చూపించిన మాదిరి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అచ్చం సినిమా కథ మాదిరే తమిళనాడులో ఓ సంఘటన జరిగింది. వ్యాపారి కుమారుడిని కొందరు కిడ్నాప్‌ చేసి డబ్బులు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు. డబ్బుతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ యువకుడు కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడ్డాడు.

తిరుప్పూర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈశ్వరమూర్తి కుమారుడు శివప్రదీప్‌ (22) కడయూరులోని రైస్‌ మిల్లుకు ఆదివారం రాత్రి కారులో శివప్రదీప్‌ వెళ్తున్నాడు. వీరచోళపురం ప్రాంతానికి చేరుకోగానే మొత్తం ఏడు మందితో కూడిన గ్యాంగ్‌ అతడి వాహనాన్ని అడ్డుకున్నారు. శివప్రదీప్‌ను వెంటనే కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. అనంతరం డబ్బుల కోసం యువకుడి తండ్రికి ఫోన్‌ చేశారు. రూ.3 కోట్లు ఇస్తేనే కుమారుడిని వదిలేస్తామని హెచ్చరించారు. కిడ్నాపర్ల హెచ్చరికలతో భయపడిన అతడి తండ్రి అడిగిన మొత్తాన్ని ఇచ్చేయడంతో కిడ్నాపర్లు ఆ యువకుడిని వదిలేశారు. (చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరెస్ట్‌)

అయితే రూ.మూడు కోట్లు అప్పనంగా పోయాయని భావించిన ఈశ్వరమూర్తి కాంగేయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకుని వ్యాపారవేత్తకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించారు. వారిలో ముగ్గురి నుంచి రూ.1.69 కోట్లు, మరొకరి నుంచి రూ.20.44 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన ఆరు గంటల వ్యవధిలోనే పోలీసులు కేసు చేధించడంపై పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును సులువుగా చేధించారు.

చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’

మరిన్ని వార్తలు