విషాదం: ఎయిర్‌ బ్యాగ్‌లూ పగిలి ప్రాణాలు గాల్లోకి, నలుగురు దుర్మరణం

27 Nov, 2021 02:39 IST|Sakshi
బాలాజీ శశిధర్‌ (ఫైల్‌), శ్రీనివాస్‌రావు (ఫైల్‌), జలంధర్‌ (ఫైల్‌), కొప్పుల శ్రీ రాజు (ఫైల్‌)

డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతో అదుపు తప్పిన కారు 

ముగ్గురు అన్నదమ్ములతోపాటు డ్రైవర్‌ దుర్మరణం 

ప్రమాద తీవ్రతకు పగిలిన ఎయిర్‌ బ్యాగ్‌లు.. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు వద్ద ప్రమాదం

మానకొండూర్‌: కారు డ్రైవర్‌ నిద్రమత్తు అతనితో సహా నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకున్నా ప్రమాద తీవ్రతకు అవి పగిలిపోవడంతో ముందు కూర్చున్న ఇద్దరి ప్రాణాలు నిలవలేదు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌లోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బంధువు దశదినకర్మకు కారులో వెళ్లి వస్తుండగా నిద్రమత్తులో డ్రైవర్‌.. కారును చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

దుర్ఘటనలో ముగ్గురు అన్నదమ్ములతోపాటు, కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి గాయప డ్డారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రం జ్యోతినగర్‌కు చెందిన కొప్పుల శ్రీనివాస్‌రావు సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్‌ ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. కొప్పుల బాలాజీ శశిధర్‌ పెద్దపల్లిలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కొప్పుల శ్రీరాజు ఆర్కిటెక్చర్‌ ఇంజనీర్‌. ఈ ముగ్గురు సోదరులు తమ బావ పెంచాల సుధాకర్‌రావుతో కలసి ఖమ్మం జిల్లా లో బంధువు దశదిన కర్మకు హాజరయ్యేందుకు గురువారం ఉదయం కరీంనగర్‌ నుంచి ఖమ్మంకు కారులో వెళ్లా రు.

రాత్రి 10.30 గం. సమయంలో ఖమ్మం నుంచి కారు లో తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే కారు అతివేగంతో చెట్టును బలంగా ఢీకొట్టింది. డ్రైవర్‌ ఇందూరి జలందర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఎయిర్‌ బ్యాగ్‌లు ఓపెన్‌ అయినా.. 
దుర్ఘటన జరిగిన సమయంలో కారు ముందు భాగంలో ఉన్న ఎయిర్‌ బ్యాగ్‌లు ఓపెన్‌ అయినా ప్రాణాలు దక్కలేదు. కారు మితిమీరిన వేగంతో చెట్టును ఢీకొట్టడంవల్ల ఎయిర్‌ బ్యాగ్‌లు పగిలిపోయి ముందు భాగంలో కూర్చు న్న వ్యక్తితోపాటు, డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ముందు భాగంలో కూర్చున్న మృతుల రక్తంతో రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు తడిసిపోవడం ప్రమాద తీవ్రతను తెలి యజేస్తోంది. ప్రమాద సమయంలో కారు 100 కి.మీ.లకుపైగా వేగంతో ఉన్నట్లు భావిస్తున్నారు.

 కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. వాహనం హెడ్‌లైట్లు 30 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటనా స్థలాన్ని కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయసారిథి, మానకొండూరు సీఐ కృష్ణారెడ్డి పరిశీలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సుధాకర్‌రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు