బొగ్గు గనిలో దొంగతనానికి వెళ్లిన నలుగురు.. ఊపిరాడక..

27 Jan, 2023 17:10 IST|Sakshi

భోపాల్‌: బొగ్గు గనిలో ఇనుము చోరీ చేసేందుకు వెళ్లిన నలుగురు దొంగలు ఊపిరాడక  ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లా కాల్రిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గని నుంచి బయటకు తీశారు.

మొత్తం ఐదుగురు వ్యక్తులు కలిసి ఈ బొగ్గు గనిలోని జంక్ మెషీన్లలో ఇనుమును దొంగిలించేందుకు వెళ్లారు. ఓ వ్యక్తి బయట కాపలాగా నిలబడగా.. మిగిలిన నలుగురూ గనిలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి ఎంతసేపైనా ఉలుకూ పలుకూ లేకపోవడంతో బయట నిలబడిన వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే రెస్క్యూ టీంతో బొగ్గు గని వద్దకు వెళ్లిన పోలీసులు ఆ నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అయితే వారు అప్పటికే చనిపోయారు. లోపల ఊపిరాడకపోవడం ‍వల్లే వీరు మరణించి ఉంటారని చెప్పారు.

ఈ ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రూ.44లక్షలు విలువ చేసే 110 టన్నుల తుక్కును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్క్రాప్ డీలర్లపై చర్యలు తీసుకున్నప్పుడు ఇది బయటపడింది. దొంగలు ఇనుమును దొంగిలించి డీలర్లకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది.
చదవండి: ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రావొద్దు.. బీజేపీ నేత ఫ్యామిలీ ఆత్మహత్య!

మరిన్ని వార్తలు