హత్య కేసులో నలుగురికి యావజ్జీవ ఖైదు

28 Aug, 2021 02:25 IST|Sakshi

రూ.20 వేల చొప్పున జరిమానా

జగిత్యాల కోర్టు తీర్పు

నిందితుల్లో ఒకరు న్యాయవాది

జగిత్యాలజోన్‌: ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న న్యాయవాదితో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జగిత్యాల రెండో అదనపు జిల్లా జడ్జి గన్నారపు సుదర్శన్‌ శుక్రవారం తీర్పునిచ్చారు. అలాగే రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీవాణి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ తిర్మణి మోహన్‌రెడ్డి 2012 మే 7వ తేదీన పొలం నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో హత్యకు గురయ్యాడు. ఆయన భార్య శైలజ ఫిర్యాదు మేరకు పోలీసులు, న్యాయవాది రాచకొండ గంగారెడ్డి, బొడిగె నర్సయ్య, రాచకొండ అంజిరెడ్డి, పన్నాల మహేశ్, తిరుమణి నరసింహారెడ్డి, తిరుమణి జలపతి, తిరుమణి తిరుపతి, ముంజ భూమయ్య, ముంజ మల్లేశం, రాచకొండ లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేశారు.

తర్వాత విచారణలో ఈ హత్యతో సంబంధం లేదంటూ తిరుమణి జలపతి, తిరుమణి తిరుపతి, ముంజ భూమయ్య, ముంజ మల్లేశం, రాచకొండ లక్ష్మీనారాయణల పేర్లను చార్జీ షీట్‌ సమయంలో పోలీసులు తొలగించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా రాచకొండ గంగారెడ్డి, బొడిగె నర్సయ్య, రాచకొండ అంజిరెడ్డి, పన్నాల మహేశ్, తిరుమణి నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన రాచకొండ బాపురెడ్డి హత్య కేసులో మృతుడు మోహన్‌రెడ్డి, రాచకొండ గంగారెడ్డి కుటుంబాల మధ్య పాత పగలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే మోహన్‌రెడ్డి హత్య జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం జడ్జి సుదర్శన్‌.. రాచకొండ గంగారెడ్డి, బొడిగె నర్సయ్య, పన్నాల మహేశ్, తిరుమణి నరసింహారెడ్డికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో ఎ–3గా ఉన్న రాచకొండ అంజిరెడ్డి కోర్టు విచారణ సమయంలోనే మరణించడంతో ఆయన పేరును కేసునుంచి తొలగించారు. 

మరిన్ని వార్తలు