విష ప్రయోగమా.. క్షుద్ర పూజలా..? 

15 Aug, 2020 04:00 IST|Sakshi
ఇంటి ఆవరణలో గుంత తవ్విన దృశ్యం 

ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద మృతి 

ఇంటి ఆవరణలో నిధి కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు  

మృతదేహాల వద్ద కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పూలు  

క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానిస్తున్న గ్రామస్తులు  

విష ప్రయోగం జరిగినట్లు భావిస్తున్న పోలీసులు 

వనపర్తి జిల్లాలో ఘటన.. ఎస్పీ విచారణ

వనపర్తి/గోపాల్‌పేట: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో శువ్రకారం ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. పోస్టుమార్టం ప్రాథమిక అంచనా ప్రకారం విష ప్రయోగం వల్ల మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తుండగా.. గుప్త నిధి కోసం క్షుద్ర పూజలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగపూర్‌ గ్రామానికి చెందిన హాజిరా బీ (62)కి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. వారిలో పెద్దకుమార్తె, రెండో కుమార్తె, కుమారుడు నాగర్‌కర్నూల్‌లో, చిన్నకూతురు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 11వ తేదీన హాజిరా బీ నాగర్‌కర్నూల్‌లో తన మనవడు, మనవరాలి జన్మదిన వేడుకలు నిర్వహించి మరుసటి రోజు కూతురు అస్మా (39), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (11)తో కలసి నాగపూర్‌కు వచ్చారు.

శుక్రవారం ఉదయం అదే గ్రామానికి చెందిన హాజిరా బీ బంధువు యూసుఫ్‌ అనారోగ్య సమస్య కారణంగా ట్యాబ్లెట్‌ (మాత్ర) కోసం వారి ఇంటికి వెళ్లగా.. ఇంట్లో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు విగతజీవులుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే నాగర్‌కర్నూల్‌లో ఉండే హాజిరా బీ కుమారుడు కరీం పాషాకు, గ్రామస్తులకు విషయం చెప్పాడు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఇంటి పరిసరాలను పరిశీలించారు. వంట గదిలో హాజిరా బీ, డైనింగ్‌ హాలులో అస్మా, హాలులో హసీనా, ఇంటి వెనుక గుంత వద్ద ఖాజా పాషా మృతదేహాలు ఉన్నాయి. అన్ని మృతదేహాల వద్ద కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పూలు, అత్తరు తదితర వస్తువులు ఉన్నాయి. అయితే క్షుద్ర పూజలేమైనా జరిగాయా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇంట్లో గుప్త ని«ధి కోసం తవ్విన దాఖలాలు ఉన్నాయని మృతుల బంధువులు, గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో పడి ఉండటం, మృతదేహాలపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.  

2014లో ఓసారి..
కొన్నేళ్లుగా తన ఇంటి ఆవరణలో నిధి ఉన్నట్లు నిద్రలో కనిపిస్తుందని హాజిరా బీ తరచూ చెప్పేదని గ్రామస్తులు తెలిపారు. 2014లో ఒకసారి కుటుంబ సభ్యులంతా ఇంటి ఆవరణలో ఉన్న నిధి కోసం తవ్వేందుకు యత్నించగా.. బంధువులు, గ్రామస్తులు మందలించడంతో అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 

ఎస్పీ విచారణ 
ఎస్పీ కె.అపూర్వరావు, డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఈ ఘటనపై విచారణ జరిపారు. మృతుల బంధువులతో మాట్లాడారు. ప్రాణాలు తీసుకునేంత ఇబ్బందులు లేవని వారు తెలిపారు. దీంతో పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో వివరా లు సేకరించే ప్రయత్నం చేశారు. డాగ్‌ ఘటనా స్థలం నుంచి సమీపంలోని రెండు ఇళ్లలోకి వెళ్లి తిరిగి అక్కడికే వచ్చి ఆగింది. గుప్త నిధులు బయటకు తీసేందుకు గతంలో పెద్దకొత్తపల్లి ప్రాంతం నుంచి ఓ వ్యక్తిని రప్పించినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా ఎవరినైనా పిలిపించారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. మృతుల సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నా రు. ఘటనా స్థలంలో ఉన్న వస్తువులను ఫోరె న్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. మృతుడు ఖాజాపాషా ఫోన్‌ కాల్‌ డేటాను సేకరించి గడిచిన  ఎవరెవరితో మాట్లాడారనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ సూర్యానాయక్‌ తెలిపారు. రేవల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. విష ప్రయోగం వల్లే నలుగురు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీఐ వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా