Road Accident: ఇదేం దుర్మార్గం దేవుడా! వెంకన్నకు మొక్కు తీర్చుకుండానే అనంత లోకాలకు

19 Feb, 2022 09:13 IST|Sakshi
ప్రమాదంలో మృతి చెందిన స్వాతి, ప్రేమ్‌కుమార్, చిన్నారి శ్యామ్‌ అచ్చుత (కుడి నుంచి ఎడమకు). చిత్రంలో స్వాతి భర్త నారాయణ (ఎడమ) ఉన్నారు. 

తిరుమల దర్శనానికి బయలుదేరిన ఐదుగురు గాజువాక వాసులు 

చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో లారీని కారు ఢీకొనడంతో ఘోర ప్రమాదం 

ఘటనా స్థలిలోనే నలుగురు దుర్మరణం 

మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు

Road Accident At Chittoor: తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీనివాసుని దర్శించుకోవాలని... తమ కుమార్తె పుట్టు వెంట్రుకలు స్వామికి సమర్పించుకుని మొక్కు తీర్చుకోవాలని బయలుదేరిన ఓ కుటుంబ సభ్యులు ఆ మొక్కు చెల్లించుకోకుండానే మృత్యు ఒడికి చేరిపోయారు. లారీ రూపంలో మృత్యుదేవత ఎదురురావడంతో తల్లి, ఏడాదిన్నర వయసు గల చిన్నారితోపాటు మరో ఇద్దరు యువకులు చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఘటనా స్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ హృదయవిదారక ఘటనతో గాజువాక ప్రాంతంలో విషాదం నెలకొంది.


గాజువాకలో విలపిస్తున్న స్వాతి, ప్రేమ్‌కుమార్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు 

తమ స్నేహితుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గాజువాక దరి శ్రీనగర్‌ ప్రాంతానికి పైడి ప్రేమ్‌ కుమార్‌ (23), అతని సోదరి స్వాతి (25), ఆమె కుమార్తె శ్యామ్‌ అచ్యుత (1), స్నేహితులు పాత గాజువాకకు చెందిన సునీల్, అజీమాబాద్‌ కాలనీకి చెందిన ఖాదర్‌ వలీతో కలిసి తిరుపతి బయల్దేరారు. గురువారం ఉదయం విశాఖ నుంచి రైలులో బయల్దేరిన వారు విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి ఖాదర్‌ వలీ స్నేహితుడి కారు తీసుకుని తిరుపతి బయల్దేరారు.

ఈ క్రమంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆగి వున్న లారీని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆ నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఖాదర్‌వలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు బోరున రోదిస్తున్నారు. ఈ సంఘటనతో గాజువాక ప్రాంత వాసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. 


స్వాతి పెద్ద కుమార్తె పోక్షిత (ఫైల్‌) 

పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు వెళ్లి... 
మృతురాలు స్వాతి భర్త వి.ఎల్‌.నారాయణ ఉద్యోగ రీత్యా సింగపూర్‌లో ఉంటున్నారు. దీంతో ఆమె ఇక్కడ తన తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో నాలుగేళ్ల పెద్ద కుమార్తె పోక్షితను గాజువాకలోనే తల్లిదండ్రుల వద్ద ఉంచి... ఏడాదిన్నర వయసు గల చిన్న కుమార్తె  శ్యామ్‌ అచ్యుత పుట్టు వెంట్రుకలు తిరుమల వేంకటేశ్వరస్వామికి సమర్పించి మొక్కు చెల్లించేందుకు తమ్ముడు ప్రేమ్‌కుమార్, అతని స్నేహితులు సునీల్, ఖాదర్‌వలీతో కలిసి తిరుపతి బయల్దేరింది. అలా బయలుదేరిన వీరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

స్వాతి తమ్ముడు ప్రేమ్‌కుమార్‌ నగరంలోని ఒక నగల షోరూమ్‌లో సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. అందొచ్చిన కుమారుడు, కుమార్తె మృత్యువాతపడడంతో వారి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. సమాచారం తెలిసిన వెంటనే స్వాతి తండ్రి రామచంద్రరావు సంఘటన స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సునీల్‌ ఒక సెల్‌ షాప్‌లో పని చేస్తున్నట్టు తెలిసింది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  


మృతుడు సునీల్‌ (ఫైల్‌)  

ఇదేం దుర్మార్గం దేవుడా... 
రోడ్డు ప్రమాదంలో తన ఇద్దరు పిల్లలు, మనవరాలు మృతి చెందడంపై వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇదేం దుర్మార్గం దేవుడా అంటూ వారు విలపించిన తీరు చూపరులను సైతం కన్నీరు పెట్టించింది. ‘నీ దర్శనానికి బయల్దేరిన మా బిడ్డలను తిరిగి రాకుండా చేశావా’ స్వామీ అంటూ వారు రోదించడం అక్కడి వారి హృదయాలను కలచివేసింది. మా పిల్లలను తీసుకెళ్లిపోయి మనవరాలిని మాకు అప్పగించావా అంటూ స్వాతి, ప్రేమ్‌కుమార్‌ల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

మరిన్ని వార్తలు