బడిలోనే ఒకరు.. బడికెళ్లనంటూ మరొకరు.. నలుగురు విద్యార్థులు ఒకేరోజు

3 Nov, 2022 02:41 IST|Sakshi

అందులో ముగ్గురు 14 ఏళ్ల లోపువారే..

ఏకమొత్తంగా మందులను మింగిన ఇద్దరు బాలికలు

తరగతి గదిలోనే ఉరివేసుకున్న 8వ తరగతి విద్యార్థి

కాలేజీకి వెళ్లాలని మందలించినందుకు

పురుగుల మందు తాగిన ఇంటర్‌ విద్యార్థిని...

క్షణికావేశంలో బలవన్మరణాలు.. కుటుంబాల్లో విషాదం

జిన్నారం (పటాన్‌చెరు)/ బాలానగర్‌/ వీపనగండ్ల/ గీసుకొండ: బడికి వెళ్లబోనంటూ ఒకరు.. హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఇష్టం లేదంటూ మరొ కరు.. నాతో ఇంకేం ఇబ్బంది ఉండదులే అంటూ ఇంకొకరు.. అంతా లోకం కూడా సరిగా తెలియని బడి పిల్లలు.. మరో కాలేజీ విద్యార్థిని.. చదువుల ఒత్తిడితోనో, కుటుంబానికి దూరంగా ఉండలేకనో క్షణికావేశంలో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. కన్నవారికి కన్నీరు మిగిల్చి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఒకేరోజున ఇలా నలుగురు ఆత్మహత్యలకు పాల్పడటం విషాదాన్ని నింపింది. ఇందులో ముగ్గురు 14 ఏళ్లలోపువారే కావడం ఆందోళన కలిగిస్తోంది.

చదువుకోవడం ఇష్టం లేదంటూ..
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన అమీర్‌ఖాన్, హసీనా బేగంల కుమార్తె మజియా (13). అమీర్‌ఖాన్‌ నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హసీనా బేగం ఎనిమిదేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోవడంతో మరో వివాహం చేసుకున్నాడు. మజ్యా నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన బాలిక.. తనకు చదువుకోవడం ఇష్టం లేదంటూ తిరిగి వెళ్లలేదు. బడికి వెళ్లాలంటూ నాయనమ్మ, పిన తల్లి ఇటీవల ఆమెపై ఒత్తిడి తెచ్చారు.

దీనిపై మనస్తాపం చెందిన మజియా మంగళవారం రాత్రి ఇంట్లో నాయనమ్మ వినియోగించే 20 బీపీ మాత్రలను ఒకే మింగేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. పినతల్లి రుక్సానాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మందులు కలుపుకొని తాగి..
మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం తిరుమలగిరి పంచాయతీ పరిధిలోని పెద్దబాయితండాకు చెందిన హనుమంతు, అల్లి దంపతుల కుమార్తె అలేఖ్య (12). గతేడాది ఆమెను ఆమన్‌గల్‌ గురుకుల పాఠశాలలో చేర్పించారు. హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత బాలానగర్‌లోని కస్తూర్బాగాంధీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్పించారు. ఇలాగైతే ఆత్మహత్య చేసుకుంటానని అలేఖ్య అనడంతో తల్లిదండ్రులు సముదాయించి చెప్పారు. అయితే దీపావళి సెలవులకు వచ్చిన ఆమె తర్వాత జ్వరం రావడంతో ఇంట్లోనే ఉండిపోయింది. పరీక్షలు ఉండటంతో సోమవారం మందులు తీసుకుని హాస్టల్‌కు వచ్చింది.

మంగళవారం పరీక్ష కూడా రాసింది. కానీ సాయంత్రం కూల్‌డ్రింక్‌ తెచ్చుకుని డాక్టర్‌ ఇచ్చిన మందులు కలుపుకొని తాగింది. కాసేపటికి అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. ఉపాధ్యాయులు వెంటనే ఆమెను బాలానగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి, అక్కడి నుంచి షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు బాలికను తొలుత మహబూబ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి, అక్కడి నుంచి షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా కాసేపటికే మృతి చెందింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇక తనతో ఎవరికీ ఇబ్బంది ఉండదంటూ..
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం ఇబ్రహీంబాద్‌ పరిధిలోని దుర్గ్య తండాకు చెందిన మెగావత్‌ శైలేందర్‌ (14).. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి భోజనం చేశాక స్నేహితులతో మాట్లాడాడు. అందరూ బాగా చదువుకుని జాగ్రత్తగా ఉండాలని, ఇప్పటి నుంచి తనతో ఎవరికీ ఇబ్బంది ఉండదని చెíప్పి నవ్వుకుంటూ బయటికి వెళ్లాడు. తాను చదివే తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. తరగతి గదిలో లైట్‌ వెలుగుతుండటంతో ఆఫ్‌ చేసేందుకు వెళ్లిన వాచ్‌మన్‌ నర్సింలు.. అది చూసి ఉపాధ్యాయులకు చెప్పాడు. వారు తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.

అయితే పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కాసేపటికి తహసీల్దార్‌ దశరథ్‌సింగ్‌ రాథోడ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులు, బంధువులను శాంతింపజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే శైలేందర్‌ ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది తెలియరాలేదు.

కాలేజీకి వెళ్లడం ఇష్టంలేక..
వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లికి చెందిన జమాండ్ల రాజలింగం, సుజాతల కుమార్తె రుచిత (16) ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. సుజాత గత నెల 31న గీసుకొండ మండల కేంద్రంలోని తన తల్లిగారు(రుచిత అమ్మమ్మ) ఇంటికి రుచితను తీసుకుని వెళ్లింది. మరుసటిరోజు (ఈ నెల 1న) కాలేజీకి వెళ్లాలని రుచితను తల్లి మందలించింది.

దీనిపై మనస్తాపం చెందిన రుచిత అదే రోజురాత్రి పాలలో పురుగుల మందు కలుపుకొని తాగింది. కాసేపటికి ఆమె అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం రుచిత మృతిచెందింది. మృతురాలి తండ్రి రాజలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
చదవండి: పనిలోంచి తీసేశారని కక్ష.. యజమాని కుటుంబాన్ని దారుణంగా..!

మరిన్ని వార్తలు