ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు కూలీల దుర్మరణం

5 May, 2021 03:43 IST|Sakshi
గొల్లకందుకూరు వద్ద జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదం

అదుపు తప్పి చెరువులో పడి సర్పంచ్‌తో పాటు నలుగురు కూలీల దుర్మరణం

మృతులందరూ ఒకే గ్రామానికి చెందిన వారు 

నెల్లూరు(వేదాయపాళెం): పనులకు వెళ్తున్న కూలీల బతుకులను రోడ్డు ప్రమాదం మింగేసింది. ట్రాక్టర్‌ అదుపు తప్పి చెరువులో పడడంతో.. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాలు.. నెల్లూరు రూరల్‌ మండలం సజ్జాపురం గ్రామ సర్పంచ్‌ అప్పకూటి పెంచలయ్య గొల్లకందుకూరులో పొలం కౌలుకు తీసుకుని పుచ్చ పంట సాగు చేస్తున్నాడు. పంట కోతకు రావడంతో మంగళవారం ఉదయం తన సొంత ట్రాక్టర్‌లో సజ్జాపురానికి చెందిన 12 మంది కూలీలను తీసుకుని పొలానికి బయలు దేరాడు. గొల్లకందుకూరు సమీపానికి వచ్చేసరికి చేపల చెరువు కట్ట మీదుగా వెళ్తున్న ట్రాక్టర్‌.. అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది.

ఇంజిన్‌తో పాటు ట్రాలీ నీళ్లల్లోకి పల్టీ కొట్టింది. డ్రైవర్‌తో సహా ట్రాక్టర్‌లోని కొందరు ప్రమాదాన్ని ముందే గుర్తించి.. కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. నీళ్లల్లో ట్రాలీ మీద పడటంతో పాక కృష్ణవేణి(26), కిలారి హైమావతి(43), లాలి లక్ష్మీకాంతమ్మ(45), సర్పంచ్‌ అప్పకూటి పెంచలయ్య (60), తాండ్ర వెంకరమణమ్మ(19) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని.. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. అలాగే ప్రమాద విషయం తెలిసిన వెంటనే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. మృతులందరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో.. సజ్జాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.   

మరిన్ని వార్తలు