చెరువులో మునిగి నలుగురు హైదరాబాద్‌ యువకులు మృతి

4 Oct, 2021 07:24 IST|Sakshi
సయ్యద్‌ జునైద్, జునైద్‌ ఖాన్‌ (ఫైల్‌), ఫహాద్‌ ఖాన్, హైదర్‌ఖాన్‌ (ఫైల్‌)

కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌ గోడివాడలో ఘటన

సలీంబాబానగర్‌లో విషాదం

బెంగళూరు: బీదర్‌ జిల్లా గోడివాడ దర్గా సమీపంలో ఉన్న చెరువులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సలీంబాబా నగర్‌ బస్తీకి చెందిన జునైద్‌ఖాన్‌ (21), అతని సోదరుడు ఫహాద్‌ఖాన్‌(16), ఆదే ప్రాంతానికి చెందిన సయ్యద్‌ జునైద్‌(16), కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన హైదర్‌ఖాన్‌ (16)లు ఆదివారం గోడివాడి దర్గాకు కారులో బయలుదేరారు. 11 గంటల ప్రాంతంలో గోడివాడకు దర్గా వద్దకు చేరుకున్నారు. పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ముందుగా హైదర్‌ వెళ్లగా అతను నీటిలో మునిగిపోతుండటాన్ని మిగతా ముగ్గురూ గమనించారు.
చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్‌ వాంఖెడే..?

అతన్ని కాపాడే క్రమంలో వీరు కూడా నీటిలో మునిగిపోయారు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటం, వీరికి ఈత రాకపోవడంతో మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుస్తులు, గుర్తింపు కార్డుల ఆధారంగా గుర్తించారు. గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురి మృతితో సలీంబాబా నగర్‌లో విషాదం నెలకొంది. కుటుంబభ్యుల రోదనలు మిన్నంటాయి. నిన్నటి వరకు కళ్లముందు తిరిగిన యువకులు ఇక లేరనే బాధను కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.  
చదవండి: ఫేస్‌బుక్‌ ప్రేమ.. యువకుడి చేతిలో మోసపోయి

మరిన్ని వార్తలు