బినామీ రుణాలతో రూ.కోటికి టోకరా 

13 Sep, 2020 07:19 IST|Sakshi
రూ.కోటికి టోకరా జరిగిన సమనస ఎస్‌బీఐ బ్రాంచి ఇదే

‘సమనస ఎస్‌బీఐ’లో నగదు అధికారే సూత్రధారి 

నగలు లేకుండానే బంగారంపై బినామీ రుణాలు 

ఆడిట్‌లో బయటపడిన ఇంటి దొంగ నిర్వాకం 

అమలాపురం రూరల్‌(తూర్పుగోదావరి): ఏదైనా వాణిజ్య బ్యాంకులో బంగారు నగలు కుదవ పెట్టి రుణం తీసుకోవాలంటే బ్యాంక్‌ అధికారులు సవాలక్ష నిబంధనలు వల్లిస్తారు. అన్ని అర్హతులు చూపించినా కుదవ పెట్టిన బంగారు నగలు మేలిమి బంగారమని నిర్ధారించటానికి నఖశిఖ పర్యంతం తనిఖీలు, ఆరా తీస్తారు. అలాంటిది అమలాపురం రూరల్‌ మండలం సమనస స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచిలో అసలు బంగారు నగలు లేకుండానే బినామీ పేర్లతో పలు దఫాలుగా రూ.కోటి దాకా రుణాలు లాగేసి బ్యాంక్‌కు టోకరా వేసేశారు. వేసింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ బ్యాంక్‌ నగదు అధికారే. మొత్తం రూ.కోటి గోల్‌మాల్‌కు ఈ నగదు అధికారే సూత్రధారి..పాత్రధారి. బ్రాంచి ప్రతి ఏటా వార్షిక ఆడిట్‌ విధిగా జరగుతుంది. మార్చి నెల తర్వాత ఏదో నెల బ్యాంకుకు వచ్చి ఆడిట్‌ బృందం ఆడిట్‌ చేస్తుంది. అందులో భాగంగానే గత నెల ఆగస్టు చివరి వారం, ఈ నెల మొదటి వారం దాదాపు రెండు వారాలపాటు సాధారణ ఆడిట్‌ జరిగినప్పుడు రూ.కోటికి టోకరా బయటపడింది.

సాధారణంగా సమనస బ్యాంక్‌లో రోజుకు దాదాపు 20 మంది ఖాతాదారులకు బంగారు నగల కుదవపై రుణాలు ఇస్తుంది. ఇప్పటికే బ్యాంక్‌ చెస్ట్‌లో సుమారు 2 వేల మంది ఖాతాదారులకు సంబంధించి బంగారు నగలపై రుణాలు ఇచ్చారు. ఈ రెండు వేల బంగారు నగలపై రుణాలకు చెందిన ఒక్కో రుణానికి ఒక్కో వస్త్ర సంచిలో భద్రపరుస్తారు. ఈ లెక్కన రెండు వేల నగల సంచులు ఉండాలి. ఆడిట్‌ అధికారులు ఆడిట్‌ చేస్తున్నప్పుడు రెండు వేల సంచులకు 25 సంచులు తక్కువ రావడంతో మరింత లోతుగా ఆడిట్‌తో ఆరా తీశారు. బ్యాంక్‌ రికార్డుల్లో బంగారు నగలపై రుణాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్పప్పటికీ దానికి తగినట్లుగా బ్యాంక్‌ చెస్ట్‌లో నగల సంచులు లేకపోవడంతో అనుమానం వచ్చింది. ఏఏ ఖాతాదారుల పేరున ఈ రుణాలున్నాయనే దిశగా తనిఖీలు చేశారు. అయితే ఆ పేర్లు బినామీలుగా గుర్తించారు. అవి బ్యాంక్‌ నగదు అధికారి కుటుంబీకులు, బంధువుల పేర్లతో ఉన్నట్లు కూడా గమనించారు. మొత్తం మీద బ్యాంక్‌ నగదు అధికారి నిర్వాకమేనని తేల్చారు.  

ఇది ఒక్కరి పనేనా..? 
రూ.కోటి మేర బంగారు నగలపై బినామీ రుణాలు పొందిన మోసం బ్యాంక్‌లో ఒక్క నగదు అధికారి వల్లే జరిగిందా.. లేక బ్యాంక్‌ సిబ్బందిలోనే ఎవరైనా ఒకరిద్దరు సహకరించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు వారాలు సాధారణంగా ఆడిట్‌ చేపట్టిన ఆడిట్‌ బృందం రూ.కోటి లెక్కలు తేడా రావడంతో తమ ఆడిట్‌ను మరో వారం రోజులు పాటు కొనసాగించారు. శుక్రవారం వరకూ గత 21 రోజులుగా ఆ బ్యాంక్‌లో రూ.కోటి గోల్‌మాల్‌పై లోతైన ఆడిట్‌ జరుగుతూనే ఉంది. ఇది కాకుండా విజయవాడ నుంచి మరో బ్యాంక్‌ ఉన్నతాధికారులతో కూడిన ఆడిట్‌ బృందం సోమవారం సమనస బ్యాంక్‌కు రానుంది. ఈ ఉన్నత స్థాయి బృందం రూ.కోటికి టోకరా ఒక్క నగదు అధికారి వల్లే జరిగిందా... సిబ్బందిలో ఎవరి సహకారం ఉందా అనే కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. అయితే బ్యాంక్‌లో ఖాతాదారులకు ఎవ్వరికీ ఈ బినామీ రుణాలు, రూ.కోటి మాయం వల్ల ఇబ్బందులేమీ ఉండవని ఆ బ్యాంక్‌ అధికారులు వివరణ ఇస్తున్నారు. ఈ అవకతవకలు బ్యాంక్‌ అంతర్గతంగా జరిగినే తప్ప ఖాతాదారులపై ప్రభావం చూపే పరిస్థితులు లేవని స్పష్టం చేస్తున్నారు.  

రూ.కోటి దాటితే సీబీఐ విచారణ అనివార్యం  
సాధారణంగా వాణిజ్య బ్యాంక్‌ల్లో నగదు దుర్వినియోగం రూ.కోటి. అంతుకు మించి  జరిగినప్పుడు సీబీఐ విచారణ అనివార్యం. సమనస స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.కోటి మూడు లక్షలు వరకూ అవకతవకలు జరిగాయి. దీంతో ఇంతటి భారీ నగదు గోల్‌మాల్‌పై సీబీఐ దర్యాప్తు అనివార్యం కానుందని ఆ బ్యాంక్‌కు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఈ కేసు సీబీఐకి వెళ్లకుండా సూత్ర«ధారి అయిన నగదు అధికారిచే రూ.కోటిలో కొంత మొత్తాన్ని రికవరీ చేయించే ప్రయత్నం తెర వెనుక జరుగుతున్నట్లు తెలిసింది. నగదు అధికారి, అకౌంటెంట్‌లు బంగారు నగలపై రుణాలకు కస్టోడియల్‌గా ఉంటారు. వీరిద్దరి వద్ద నగలు భద్ర పరచిన లాకర్‌కు సంబంధించి తాళాలు చెరొకరి దగ్గర ఉంటాయి. ఉదయం సాయంత్రం విధిగా కుదవ పెట్టిన నగల సంచులను ఆ ఇద్దరూ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ గోల్‌ మాల్‌లో నగదు అధికారితో పాటు అకౌంటెంట్‌ పాత్ర ఉండవచ్చన్న అనుమానాలు బ్యాంక్‌ సిబ్బందిలో వినిపిస్తున్నాయి.  

బ్యాంకులో దోపిడీ.. ఆక్వా చెరువులపై పెట్టుబడి  
బ్యాంకులో రూ.కోటి బినామీ రుణాలకు సూత్రధారైన బ్యాంకు నగదు అధికారి బుద్ధిగా బ్యాంక్‌ అధికారిగా ఉద్యోగం చేసుకోకుండా తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందాలన్న అత్యాశతో ఆక్వా సాగుపై కూడా ఓ కాలు మోపారు. బ్యాంక్‌లో బినామీ రుణాలతో కాజేసిన రూ.లక్షల సొమ్ములు ఆక్వా చెరువుల సాగులో పెట్టుబడిగా పెట్టడం.. ఆ సాగులో నష్టాలు రావడంతో భర్తీకి తాను పనిచేసే బ్యాంక్‌కే కన్నం వేసినట్లు బంగారు నగల పేరుతో బినామీ రుణాల బాగోతానికి తెరతీశారు. తాను నగదు అధికారే కదా.. టోకరా వేసిన ఎవరికీ అనుమానం రాదని భావించాడు కాబోలు తాను పనిచేసే బ్యాంక్‌ను తన మోసాలకు వేదికగా మార్చుకుని 
ఇంటి దొంగగా మిగిలారు.   

మరిన్ని వార్తలు