టెలిగ్రామ్‌ ద్వారా మోసాలు.. అమ్మకానికి జనన, మరణ ధ్రువపత్రాలు

26 Aug, 2021 13:24 IST|Sakshi

ఫోన్‌పే ద్వారా నగదు వసూలు

వెంటనే కావాల్సిన ధ్రువీకరణ పత్రం అందజేత

వీటితో ప్రభుత్వ పథకాలతోపాటు పలు శాఖల్లో మోసాలకు పాల్పడే ప్రమాదం

ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో భారీ దందా

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 50 ఏళ్ల క్రితం మరణించగా సంబంధిత వ్యక్తి వారసులు ఆయన మరణ ధ్రువీకరణ పత్రం కోసం రెవెన్యూ, పంచాయతీ కార్యాలయాల్లో సంప్రదించగా అధికారులు రికార్డుల్లో లేదని తెలిపారు. దీంతో వారసులు ఓ ఇంటర్‌నెట్‌ సెంటర్‌ నిర్వాహకుడి సహాయంతో రూ.1,000 చెల్లించి విజయనగరం జిల్లాలోని ఓ పీహెచ్‌సీ రికార్డుల్లో నమోదైనట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. అనంతపురం జిల్లాకే చెందిన ఓ వృద్ధుడు ఆధార్‌ కార్డులో వయసు మార్పు కోసం ఇదే తరహాలో రూ.900 చెల్లించి జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు.

ఇలా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు ఓ అంతర్రాష్ట్ర ముఠా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో యథేచ్ఛగా కొనసాగిస్తోంది. 1990 తర్వాత జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. వీటిని మంజూరు చేసే అధికారం గ్రామ, మండల, పురపాలక స్థాయి అధికారులకు ఉంది. జనన, మరణాల వివరాలు రికార్డుల్లో లేకపోతే తగిన ధ్రువీకరణ పత్రాలను అందించి మీసేవ లేదా గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆ తర్వాత ఆర్డీవో వాటిని రికార్డుల్లో నమోదు చేసి.. ఆయా పత్రాల మంజూరుకు అనుమతి ఇస్తారు. కానీ ఇవన్నీ లేకపోయినా కేవలం రూ.600తో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందిస్తోంది.. అంతర్రాష్ట్ర ముఠా. ఈ ముఠా ఆగడాలను పరిశీలిస్తే సాంకేతికంగా ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తుల నేతృత్వంలోనే ఈ దందా భారీ ఎత్తున సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ముఠా మోసాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 

మీసేవా, ఇంటర్‌నెట్‌ సెంటర్ల నిర్వాహకుల నంబర్లు సేకరించి..
ఆన్‌లైన్‌ ద్వారా సరికొత్త దందాకు తెరలేపిన అంతర్రాష్ట్ర ముఠా ముందుగా ప్రజలు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం సంప్రదించే ఇంటర్‌నెట్, మీసేవా సెంటర్లపై కన్నేస్తోంది. వాటి నిర్వాహకుల నంబర్లను సేకరించి.. వారిని టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా తమ గ్రూపు సభ్యులుగా చేర్చుకుంటోంది. గ్రూప్‌ అడ్మిన్‌కు వివరాలు పంపి.. ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లిస్తే చాలు.. జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని మంజూరు చేయడం తీవ్ర నేరం. విద్రోహశక్తులు, సైబర్‌ నేరగాళ్లకు ఇవి ఊతంగా మారే ప్రమాదం లేకపోలేదు. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హత పొందడం, బీమా సంస్థల నుంచి సొమ్మును పొందటం, ఉద్యోగాల్లో పదోన్నతి పొందడం, తదితర చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే అవకాశమూ ఉంది. 

ఫోన్‌పేలో రూ.600 చెల్లిస్తే చాలు.. 
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాల్సినవారు టెలిగ్రామ్‌లో ‘సర్టిఫికెట్‌ సర్వీస్‌ చార్జబుల్‌’ అనే గ్రూపు నిర్వాహకుడికి వివరాలను పంపి రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. రితేష్‌కుమార్‌ అనే వ్యక్తి ఫోన్‌పే నంబర్‌ 9939844009కు నగదు పంపి.. ఆ స్క్రీన్‌ షాట్‌ను పంపితే చాలు.. క్షణాల్లో సంబంధిత రాష్ట్రంలోని ఏదైనా ఓ పీహెచ్‌సీలో నమోదు చేసిన పత్రాలను ఆన్‌లైన్‌లోనే సదరు వ్యక్తులకు పంపుతున్నారు. 

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కొద్దు
టెలిగ్రామ్‌ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్న ముఠా ఉచ్చులో ప్రజలెవరూ చిక్కుకోవద్దు. ముఖ్యంగా ఇంటర్‌నెట్, మీసేవా నిర్వాహకులు ఈ ముఠా సభ్యుల మాటలు నమ్మి ప్రజలకు నకిలీ ధ్రువీకరణ పత్రాలను అందించవద్దు. ఇలాంటివాటిని ఉపయోగించి ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందినా, బీమా సంస్థలను మోసం చేసినా, ఉద్యోగోన్నతి కోసం వీటిని ఉపయోగించినా నేరంగా పరిగణిస్తాం. 
–డాక్టర్‌ కె.ఫక్కీరప్ప, ఎస్పీ, అనంతపురం

గతంలో ఆధార్‌ కార్డుల్లో వయసు మార్పు
ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజల జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఈ ముఠా అందజేస్తున్నట్లు సమాచారం. తాము అందిస్తున్న ధ్రువీకరణ పత్రాల్లోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసినా అన్ని వివరాలు పక్కాగా ఉంటాయని ఈ ముఠా టెలిగ్రామ్‌ గ్రూపులలో సందేశాలు పంపుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి జనన ధ్రువీకరణ పత్రం కావాలని టెలిగ్రామ్‌ గ్రూపులో సదరు ముఠా సభ్యుడితో చాటింగ్‌ చేయగా.. వెంటనే అనంతపురం జిల్లా రాయదుర్గం పీహెచ్‌సీలో డేటా అందుబాటులో ఉందని సంక్షిప్త సందేశం పంపించాడు. హిందూపురంలోనూ ఇదేవిధంగా పత్రాలను అందజేస్తామన్నాడు.

అలాగే విశాఖపట్నం చెందిన ఓ వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం కోసం సంప్రదించగా.. విశాఖపట్నం ఆర్‌సీడీ హాస్పిటల్‌లో అందజేస్తామని సమాధానం ఇచ్చాడు. ఇలా అడిగిన వెంటనే ఫోన్‌పే ద్వారా డబ్బులు జమ చేయించుకుని నిబంధనలకు విరుద్ధంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. గతంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి ఆధార్‌ కార్డుల్లో వయసును విచ్చలవిడిగా మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఘటనలు విదితమే. అప్పట్లో ఆధార్‌లో వయసు మార్పునకు పాన్‌కార్డులో వయసు మార్చారు. కాగా ఇప్పుడు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లభించే జనన ధ్రువీకరణ పత్రాలను ఇందుకు వినియోగిస్తుండటం గమనార్హం.
 

మరిన్ని వార్తలు