బ్యాంకు మేనేజర్‌ పేరు చెప్పి టోకరా

11 Sep, 2020 08:44 IST|Sakshi

ముమ్మిడివరం (తూర్పుగోదావరి): ‘‘నేను బ్యాంకు మేనేజర్‌ను.. మీ ఖాతాకు ఆధార్‌ లింకు కానందువల్లే ప్రధాన మంత్రి స్కీమ్‌ రూ.10 వేలు మీ ఖాతాకు జమ కాలేదు.’’ అంటూ ఓ ఖాతాదారుడి బ్యాంకు వివరాలు తెలుసుకుని అతడి ఖాతా నుంచి రూ.94వేలు కాజేసిన ఉదంతమిది. ముమ్మిడివరం ఎస్సై కేవీ నాగార్జున కథనం ప్రకారం.. కొత్తలంక పంచాయతీ శివారు తోట్ల పాలానికి చెందిన ఈతకోట మణిరాజు కొత్తపేట లేబర్‌ ఆఫీసులో సబార్డ్‌నేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఈనెల 7వ తేదీన సెల్‌: 7908490408 ద్వారా ఫోన్‌ వచ్చింది. ‘‘నేను బ్యాంకు మేనేజర్‌ను నీకు ప్రధాన మంత్రి స్కీమ్‌ ద్వారా వచ్చే రూ.10వేలు ఈ ఖాతాకు ఆధార్‌ లింక లేకపోవడం వల్ల జమ కాలేదు’’ ఈ మొత్తం జమ కావాలంటే నీ ఆధార్, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ చెప్పాలి అని మణిరాజును అవతలి వ్యక్తి కోరాడు.

నీ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును పై మొబైల్‌ నంబర్‌కు గూగుల్‌ పే చేయాలని సూచించాడు. దీంతో మణిరాజు తన ఖాతాలో ఉన్న రూ.94 వేలు గూగుల్‌ పే చేసి ఫోన్‌ చేశాడు. నీకు పది నిమిషాల్లో నీ సొమ్ము రూ.94 వేలతో పాటు ప్రధాన మంత్రి స్కీమ్‌ రూ.10వేలు కలిపి రూ.1,04,000 నీ ఖాతాలో జమవుతాయని చెప్పాడు. అప్పటి నుంచి ఆ నంబర్‌కు ఫోన్‌ చేసినా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉందని మణిరాజు తెలిపాడు. బ్యాంకుకు వెళ్లి చూడగా తాను మోసపోయాయని తెలిసి గురువారం  ముమ్మిడివరం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కేవీ నాగార్జున తెలిపాడు. 

మరిన్ని వార్తలు