సాఫ్ట్‌వేర్‌ హిజ్రా.. ఆడ గొంతుతో అందంగా మాట్లాడి..

4 Jul, 2021 18:53 IST|Sakshi

ఆడ గొంతులో మాట్లాడి బురిడీ 

రూ.15.12 లక్షలు స్వాహా  

అమలాపురం టౌన్‌ (తూర్పుగోదావరి): ఆడ గొంతుతో అందంగా.. ఆకర్షణీయంగా మాట్లాడడం అతనికి అలవాటైన ప్రక్రియ. ఇదే అతని మోసాలకు ఉపయోగపడింది. తనదో కాల్‌ సెంటర్‌ అంటూ కరోనా కష్టాలతో ఇంటి వద్దే ఉంటున్న నిరుద్యోగులతో ఆంగ్లంలో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నయవంచన చేశాడు. నెల్లూరుకు చెందిన నకరికంటి శివదినేష్‌ (33) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అతను హిజ్రా కావడంతో అతనిది ఆడ గొంతులా ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొందరు నిరుద్యోగుల ఫోన్‌ నంబర్లు సేకరించి.. వారికి ఉద్యోగాలిప్పిస్తానని ఆడ గొంతుతో ఆకట్టుకునేలా చెప్పేవాడు. ఇతని మోసపూరిత మాటలకు అమలాపురం పట్టణం, అంబాజీపేట ప్రాంతాలకు చెందిన ఆరుగురు నిరుద్యోగులు బుట్టలో పడ్డారు. ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న ఆశతో వారు రూ.15.12 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి లబోదిబోమంటున్నారు.

అమలాపురంలో అన్నదమ్ములైన ఇద్దరు నిరుద్యోగుల నుంచి రూ.6.70 లక్షలు, అంబాజీపేటకు చెందిన నలుగురు నిరుద్యోగుల నుంచి రూ.8.42 లక్షలు కాజేశాడు. తరచూ ఫోన్లు చేస్తూ ఆన్‌లైన్‌లో డబ్బులు వేయించుకుని ఉద్యోగాలు ఎంతకీ ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చిన బాధిత నిరుద్యోగులు అమలాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ ఆధ్వర్యంలో ఎస్సై ఎం.ఏసుబాబు తమదైన శైలిలో దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితుడు పని చేస్తున్నానని చెప్పిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.. అతని బ్యాంక్‌ అకౌంట్‌ చిరునామా ద్వారా అతడు ఆడ గొంతుతో తమను బురిడీ కొట్టించాడని బాధితులు నిర్ధారించుకున్నారు.

కరోనాతో పనులు లేక అల్లాడుతున్న తమకు ఏదైనా ఉద్యోగం దొరికితే కుటుంబాలకు కొండంత ఆసరా అవుతామనే ఆశతో రూ.లక్షల్లో డబ్బులు చెల్లించామని లబోదిబోమంటున్నారు. ఒక్కో ఉద్యోగానికి రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకూ అవుతుందని అతడు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఓ బృందంగా నెల్లూరు వెళ్లి నిందితుడు శివ దినేష్‌ను అదుపులోకి తీసుకుని అమలాపురానికి తీసుకొచ్చారు. అతడిని శనివారం అరెస్ట్‌ చేసి కోర్డులో హాజరు పరిచినట్లు ఎస్సై ఏసుబాబు తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసి ఉద్యోగాలిస్తామంటే నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. తెలియని వ్యక్తులతో ఇలాంటి ఫోన్‌ సంభాషణలు చేయవద్దని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు