ఉద్యోగాల పేరిట మోసం 

26 Jan, 2021 11:09 IST|Sakshi

 కట్టిన డబ్బులు అడిగినందుకు యువతిపై దాడి 

శిక్షణ కోసం ఆశావాహుల నుంచి డిపాజిట్ల సేకరణ 

యూఎస్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థ నిర్వాహకుల నిర్వాకం

గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ‘‘నెల రోజులు శిక్షణ ఇస్తాం... తర్వాత ఉద్యోగం ఇప్పిస్తాం... ఈ సంస్థలోనే పనిచేస్తామంటే రూ.10 వేలు నుంచి రూ.15వేలు జీతంతో కొలువు ఇస్తాం... అందుకు ముందుగా కొంత డబ్బు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయండి...’’ ఇలా నిరుద్యోగులకు ఆశపెట్టి మోసం చేస్తోంది యూఎస్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థ. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో ప్రారంభించిన ఈ సంస్థపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఓ యువతి తాను కట్టిన డబ్బులు ఇచ్చేయమని కోరడంతో... సదరు సంస్థ నిర్వాహకులు దాడి చేయడంతో సంస్థ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కడప ప్రాంతానికి చెందిన గుమ్మడి సాయి ధరణిధర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, నగరానికి చెందిన మళ్ల పావని సీఈవోగా యూఎస్‌ టెక్‌ సొల్యూషన్స్‌ను గత ఏడాది మార్చిలో సాకేతపురంలో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి డిపాజిట్లు సేకరిస్తున్నారు.

ఈ క్రమంలో అనకాపల్లికి చెందిన మేడిశెట్టి పావని యూఎస్‌ టెక్‌ సొల్యూషన్స్‌లో చేరింది. చేరిన సమయంలో రూ.2500 సెక్యూరిటీ డిపాజిట్‌ చేసింది. అయితే తాను శిక్షణ తీసుకోనని, కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల కోరింది. డబ్బులు తీసుకునేందుకు సోమవారం రావాలని నిర్వాహకులు మెసేజ్‌ పెట్టారు. దాంతో అనకాపల్లి నుంచి పావని వచ్చి సంస్థ కార్యాలయంలో సంప్రదించగా... తర్వాత రండి డబ్బులు ఇస్తామని చెప్పారు. మళ్లీ కొద్దిసేపటికే కమ్‌ బ్యాక్‌ అంటూ సదరు యువతికి మెసేజ్‌ చేశారు. దీంతో మళ్లీ సంస్థ కార్యాలయానికి బంధువు జస్వంత్‌తో కలిసి వెళ్లగా... పావనిపై ఎండీ గుమ్మడి సాయి ధరణిధర్, సీఈవో మళ్ల పావని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దాడి చేశారు. ఆ సంస్థలో పని చేస్తున్న వారు బాధితుల చేతులు, కాళ్లు పట్టుకోగా... ధరణిదర్, మళ్ల పావని దాడి చేశారు. బాధితురాలు పావని పెదవి చిట్లిపోగా.., జస్వంత్‌ మెడపై గాయాలయ్యాయి. కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారని బాధితురాలు మేడిశెట్టి పావని వాపోయింది. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించడంతో యువతిపై దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాయిధరణిధర్, సీఈవో పావని పరారీలో ఉన్నారు.
 
సంస్థపై 9 నెలల్లో నాలుగు కేసులు  
యూఎస్‌ టెక్‌సొల్యూషన్స్‌ సంస్థపై గతంలో ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. సదరు సంస్థలో కంప్యూటర్లు లేవని, ఇప్పటి వరకూ ఒక్కరికీ జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవని చెబుతున్నారు. ఇక్కడ ఎవరైనా ఉద్యోగం చేయాలనుకుంటే సొంతంగా ల్యాప్‌టాప్‌లు తీసుకొచ్చి విధులు నిర్వహించాలని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 30 మంది శిక్షణ పొందుతూ పనిచేస్తున్నారు. కొన్ని నెలల కిందట ఇలాగే జీతాలు చెల్లించమని ప్రశ్నించిన దంపతులపై కూడా నిర్వాహకులు దాడి చేశారని తెలిసింది. అయితే అప్పట్లో వారు పోలీసులను ఆశ్రయించకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. కొద్దిరోజుల కిందట సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి జీతం ఇవ్వాలని అడిగితే దాడి చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని ఇక్కడ శిక్షణ పొందేందుకు వచ్చిన నిరుద్యోగులు సైతం ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని తమగోడు చెప్పుకున్నారు.       
   

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు