సబ్సిడీ రుణాల పేరిట దళితులకు కుచ్చుటోపీ

1 Feb, 2021 08:15 IST|Sakshi

రూ.4 కోట్లు దండుకుని పరారైన ఘరానా మోసగాడు

తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా)‌: సబ్సిడీ రుణాలిప్పిస్తానంటూ వర్ధన్‌ మల్టీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో దళితుల నుంచి రూ.4 కోట్ల వరకు దండుకుని బోర్డు తిప్పేసిన ఘరానా మోసగాడి ఉదంతమిది. తాము మోసపోయామని తెలుసుకున్న దళితులు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒకరైన తూర్పు గోదావరి జిల్లా మాదిగ ఐక్య వేదిక చైర్మన్‌ మడికి కిశోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన జగతపు జాషువా అనే వ్యక్తి తాడేపల్లి బైపాస్‌ రోడ్డులో వర్ధన్‌ మల్టీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. (చదవండి: అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం

కేంద్ర ప్రభుత్వం గేదెల కొనుగోలు నిమిత్తం సబ్సిడీ రుణాలు ఇస్తోందని.. ముందుగా రూ.లక్ష చెల్లిస్తే వారి అకౌంట్‌లో రూ.1.60 లక్షలు జమ అవుతాయని నమ్మబలికాడు. రుణాలు పొందగోరే వారు ముందుగా రూ.లక్ష చొప్పున చెల్లించి సొసైటీలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కోరడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అనేక మంది దళితులు అతడి వలలో చిక్కి మోసపోయారు. 15 రోజుల నుంచి తాడేపల్లిలోని వర్ధన్‌ మల్టీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ కార్యాలయంలో ఎవరూ కనిపించడం లేదని కిశోర్‌బాబు తెలిపారు. దీంతో జగతపు జాషువా గురించి ఆరా తీయగా.. అతడిపైన, అతడి కుటుంబ సభ్యులపైన మూడు రాష్ట్రాల్లో 21 కేసులు నమోదైనట్టు తెలిసిందన్నారు. అతడు ఓసారి నకిలీ పీటీ వారెంట్‌తో జైలు నుంచి తప్పించుకున్నాడని.. అంతేకాకుండా అతను చనిపోయినట్టుగా సమాజాన్ని నమ్మించి.. కొత్త ముసుగు వేసుకొని ప్రజలను మోసగిస్తున్నట్టు తెలిసిందని వివరించారు.(చదవండి: అది టీడీపీ నేతల కుట్రే)

మరిన్ని వార్తలు